- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆపరేషన్ హుజురాబాద్.. ‘నిఘా’ వర్గాలకూ తప్పని పొలిటికల్ ‘పంచ్’లు
దిశప్రతినిధి, కరీంనగర్ : కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయరైంది పోలీసుల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ బై పోల్స్‌లో అన్ని వర్గాల పరిస్థితి ఎలా ఉన్నా పోలీసులు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలకు గురవుతున్నారు. చీమ చిటుక్కుమన్నా బాసులకు చెప్పాలి. లేనట్టయితే వారి నుండి చీవాట్లు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంటిల్లి పాదిని మర్చి ఊరూ వాడా తిరిగి ఏం జరిగినా అప్‌డేట్ చేయాల్సిన డ్యూటీ వారిది. ఇంత చేసినా ఏమైనా సంతోషం ఉందా అంటే అదీ కూడా లేకుండా పోతోంది వారికి. తాజాగా వీణవంక మండలం వల్భాపూర్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపురెడ్డిపై దాడి జరిగినంత పని చోటు చేసుకోవడం పోలీసు వర్గాలను నివ్వెరపరిచింది. ఏ గ్రామంలో ఏం జరుగుతోందోనన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైపు చూస్తున్న వారి గురించి కూడా సమాచారం చేరవేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై ఉంటుంది. మఫ్టీలో తిరిగే వీరంతా ఓ వైపున జియో ట్యాగ్ చేస్తూ బాసులకు అప్ డేట్స్ అందించాలి.
అప్పటి నుండి అక్కడే..
ఈటల ఎపిసోడ్ వ్యవహరం తరువాత నుండి నిఘా కళ్లన్నీ కూడా హుజురాబాద్ వైపే చూస్తున్నాయి. మూడు నెలలకు పైగా హుజురాబాద్‌లోనే తిరుగుతూ దాదాపు మకాం పెట్టినంత పనవుతోంది. నిఘా వర్గాలకు ఇటీవలి కాలంలో వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న సమయాన్ని నిమిషాలపై లెక్కించాల్సిన పరిస్థితి తయారైందంటే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ యంత్రాంగం హుజురాబాద్‌లో ఎంత సమయం వెచ్చిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పుడో అర్థరాత్రి ఇంటికి చేరుకుని, సూర్యుని కన్నా ముందే ఫీల్డ్‌లో ఉంటున్నారు.
లా అండ్ ఆర్డర్ టు ఇంటెలిజెన్స్..
ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులే టార్గెట్ అయ్యే వారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదుర్కొనే వారు. కానీ విచిత్రంగా హుజురాబాద్‌లో మాత్రం ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వింగ్స్ టార్గెట్ కావడం గమనార్హం. లా అండ్ ఆర్డర్ వింగ్‌లో పనిచేస్తున్న పోలీసులు అధికార పార్టీకి తొత్తులగా మారారంటూ ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడమాత్రం నిఘా వర్గాల జోక్యం తీవ్రంగా పెరిగిందన్న అభిప్రాయాలతో పాటు వీరే గొడవలకు కారకులు అవుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారూ లేకపోలేదు. ప్రత్యర్థి పార్టీల కదలికలపై నిఘా వేస్తూ సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో తాజాగా ఇప్పుడు మొబైల్స్‌లో వీడియోలు, ఫొటోలు కూడా తీసి పంపించాల్సిన పరిస్థితి తయారు కావడం వల్లే వీరిపై కన్ను పడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా పార్టీ ఫిరాయిస్తున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు బాసులకు పంపిస్తుండటం, వెంటనే సదరు నాయకులకు అధికార పార్టీ నుండి ఫోన్లు వెల్తుండటంతో వారు వెనక్కి తగ్గుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. దీంతో తమ పార్టీ బలాన్ని పెంచుకుంటున్న క్రమంలో నిఘా వర్గాలు ఇస్తున్న సమాచారం వల్లే తమకు నష్టం వాటిల్లుతోందన్న అభిప్రాయం ఈటల వర్గంలో బలంగా నాటుకుపోయిందని తెలుస్తోంది. ముందస్తుగానే సమాచారాన్ని చేరవేయడం వల్ల తమ వ్యూహాలకు చెక్ పడుతోందన్న ఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది.