- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కష్టాల్లో మాయాజాలం!
కరోనా వైరస్ సోకితే ఆరోగ్యం సంగతేమోగానీ ఆర్థికంగా కోలుకోవడం మాత్రం చాలా కష్టయ్యేలా ఉంది. హెల్త్ ఇన్సూరెన్సు ఉన్నా జేబులు గుల్ల కావడం ఖాయం. చికిత్స అందించే ఆసుపత్రుల స్థాయికి తగ్గట్లుగా చేతి చమురు వదిలించుకోవలసిందే. కరోనా వ్యాధిని ఆరోగ్య బీమాలో చేరుస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వెసులుబాటు ఇచ్చింది. అయినా ఆసుపత్రిలో చేరిన తర్వాత సవాలక్ష నిబంధనలు ఆటంకంగా మారుతున్నాయి. కరోనా చికిత్సకు సంబంధించి రెగ్యులేటరీ అథారిటీ స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించకపోవడమే ఇందుకు కారణం.
దిశ, న్యూస్ బ్యూరో: వేలాది రూపాయలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్సు తీసుకున్నా, వాడుకునే వెసులుబాటు ఉన్నా కవరేజ్ పరిధిలోకి రాదంటూ బీమా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయి. బెడ్, వార్డు ఛార్జీలు తప్ప మిగిలినవన్నీ చేతి నుంచి కట్టాల్సిందే. పీపీఈ కిట్, ఎన్-95 మాస్కు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవన్నీ కవరేజీ పరిధిలోకి రావు. ఆసుపత్రుల స్థాయి, నగరాల వర్గీకరణ ప్రకారం కరోనా చికిత్సకయ్యే ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత వినియోగదారులు క్లెయిమ్ పొందే సమయానికి బీమా కంపెనీలు రంధ్రాన్వేషణ చేస్తూ కొసరికొసరి లెక్కలు వేస్తుండడంతో సగం కూడా రావడం లేదు. గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు 11 వేల క్లెయిమ్‌లు వస్తే, ఇందులో సగం మేరకే పరిష్కారమైనట్టు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సమాచారం. జూన్ 15 నాటికి మొత్తం రూ. 178 కోట్ల మేర హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు వస్తే అందులో సుమారు రూ.58 కోట్ల మేరకు సెటిల్ చేసినట్లు సమాచారం. మొత్తం సుమారు 11,400 క్లెయిమ్‌లు వస్తే అందులో సుమారు 6,500 వరకు పరిష్కరించినట్లు అనధికార సమాచారం.
ఇచ్చేది సగమే
క్లెయిమ్ చేసిన మొత్తంలో సగం మాత్రమే బీమా కంపెనీలు చెల్లిస్తున్నాయని, మిగిలింది వినియోగదారులపైనే నెట్టేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సగటున ఒక్కో క్లెయిమ్ మొత్తం సుమారు ఒకటిన్నర లక్షల రూపాయలు ఉంటే, బీమా కంపెనీలు మాత్రం రూ.90 వేలతోనే సరిపెడుతున్నాయి. మిగిలింది చికిత్స పొందినవారే భరించాల్సి వస్తోంది. ఢిల్లీ, కోల్‌కతా, గుర్గావ్, బెంగుళూరు నగరాల్లో కరోనాకు ఎక్కువ ఖర్చు అవుతోంది. ఈ నగరాల్లో కనీస స్థాయిలో వారం రోజుల కరోనా చికిత్సకయ్యే ఖర్చు సగటున రెండు లక్షల రూపాయలు దాటుతోంది. బీమా కంపెనీలు మాత్రం రూ. 1.15 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడంలేదు. చివరకు ఇన్సూరెన్సు తీసుకున్నా పూర్తిస్థాయిలో మనశ్శాంతి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాన్-క్లెయిమ్ జాబితాలో ఎన్నో
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేయించుకోడానికి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కనీసంగా రూ. 8 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చవుతోంది. బీమా కంపెనీలు కరోనాను హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించాయి. కానీ, నాన్-క్లెయిమ్ జాబితాలో ఎక్కువ సేవలను చేర్చడంతో ఆశించిన ప్రయోజనం లేకుండా పోతోంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత కనీసంగా ఐదారు రోజుల పాటు ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో పల్మనాలజిస్టు, జనరల్ ఫిజిషియన్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన స్పెష్టలిస్టుల కన్సల్టేషన్ ఫీజులు, వారు వచ్చిన చూసిన ప్రతీసారి పీపీఈ కిట్, ఎన్-95 మాస్కు, గ్లౌజులు, శానిటైజర్ లాంటివన్నీ బీమా పరిధిలోకి రాని అంశాలు. బ్యాండేజీ, అడ్హెసివ్ బ్యాండేజీ, గాజ్, ప్రత్యేక ఫుడ్, యాంటీ-వైరల్ డ్రగ్.. ఇలాంటివన్నీ నాన్-మెడికల్, కన్జూమబుల్స్ జాబితాలో చేర్చి బీమాకు వర్తించవని వేరే బిల్లు వేస్తున్నాయి ఆసుపత్రులు. ఒకవేళ వీటిని మామూలు బిల్లులో కలిపినా క్లెయిమ్ చేసిన తర్వాత బీమా కంపెనీలు వాటిని తొలగించి కేవలం వార్డు, బెడ్ ఛార్జీలకు మాత్రమే చెల్లిస్తున్నాయి.
అడుగు తీసి అడుగేసినా
కొన్ని ఆసుపత్రులు పీపీఈ కిట్, ఎన్-95 మాస్కులకు కలిపి రూ.1500 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని మాత్రం రూ.8000 వరకూ వసూలు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రి ఏకంగా దేనికెంత ఖర్చవుతుందో డిస్‌ప్లే బోర్డులోనే పెట్టింది. ఒక్క రోజుకు వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ వార్డులో కేవలం చికిత్స కోసం రూ. 80 వేలు ఖర్చవుతుందని పేర్కొంది. కన్జూమబుల్స్, మందులు, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజులు, నాన్-మెడికల్ అవసరాలు, ఇవన్నీ అదనం. మామూలు సమయాల్లో సైతం కొన్ని సేవలు హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాకపోవడంతో పేషెంట్లు భరించాల్సిందే. కానీ ఇప్పుడు కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ అవసరం కోసం డాక్టర్లు వచ్చి పరీక్ష చేయాలన్నా వారి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు లాంటివి తప్పవు. వీటి భారమంతా పేషెంటే భరించాలి. ఈ కారణంగా బీమా పరిధిలోకి రాని ఖర్చుల భారం ఎక్కువవుతోంది. కొన్ని ఆసుపత్రులు వార్డులో టీవీ పెట్టినందుకు ఆ ఖర్చును కూడా పేషెంట్లపైనే వేస్తున్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్‌పై పెరిగిన అవగాహన
ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రైవేటు ఉద్యోగులు సైతం వారి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రతీనెలా వేతనంలోంచి కొంత కత్తిరించుకుని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నాయి. కొద్దిమంది స్వంతంగానే సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగూ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వమే కడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం రూ. 1,779 కోట్లు ఉంది. ఈ ఏడాది అది కొంత పెరిగి రూ.1876 కోట్లకు చేరుకుంది. సుమారు 36 కంపెనీలు ఈ బీమా సేవలను అందిస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఒకటి రెండు సంస్థలు మినహా మిగిలినవన్నీ పాక్షికంగానే క్లెయిమ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నాయి. చిరుద్యోగులు వారి ఆర్థిక స్థోమత, కుటుంబ సభ్యులకు కవరేజీకి అనుగుణంగా పాలసీ తీసుకుంటున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఐదు లక్షలు లేదా పది లక్షల రూపాయల పాలసీలే తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లొంబార్డ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
ఇదీ పరిస్థితి
ఓ ప్రముఖ ఆస్పత్రి ప్రతినిధి అభిప్రాయం ప్రకారం కరోనా చికిత్సకు కనీసంగా ఐదారు రోజులు ఉండాల్సి వస్తే ఒక మోస్తరు కార్పొరేట్ ఆసుపత్రిలో ఎంత లేదన్నా రోజుకు సగటున రూ. 70 వేల వరకు ఖర్చవుతుంది. సెపరేట్ రూమ్, వెంటిలేటర్ లాంటి అవసరాలకు రోజుకు లక్ష రూపాయల కంటే ఎక్కువే ఖర్చు కావచ్చు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, గుర్గావ్, నొయిడా, బెంగుళూరు లాంటి నగరాల్లో అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్‌కు తగినట్లుగా ఈ ఖర్చు మరికొంత పెరుగుతుంది. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో పది రోజుల పాటు మామూలు వార్డులో ఉంటే కనీసంగా లక్ష రూపాయలకంటే ఎక్కువే జేబులోంచి చెల్లించుకోక తప్పదని ఆయన ముక్తాయించారు.
హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, సెటిల్‌మెంట్ ఇలా
దేశవ్యాప్తంగా జూన్ 15 నాటికి వచ్చిన క్లెయిమ్‌లు: 11,400
పరిష్కారమైనవి: 6,500
క్లెయిమ్ చేసిన మొత్తం: రూ. 178 కోట్లు
బీమా కంపెనీలు సెటిల్ చేసినవి: రూ. 58 కోట్లు
ప్రాంతం | క్లెయిమ్ చేసిన సగటు | బీమా కంపెనీలు సెటిల్ చేసింది |
ఢిల్లీ | రూ.2.30 లక్షలు | రూ.1.05 లక్షలు |
పశ్చిమబెంగాల్ | రూ.2.50 లక్షలు | రూ.1.15 లక్షలు |
బెంగుళూరు | రూ.2.10 లక్షలు | రూ.1.10 లక్షలు |
హర్యానా | రూ.1.50 లక్షలు | రూ.85 వేలు |
మహారాష్ట్ర | రూ.1.20 లక్షలు | రూ.80 వేలు |
దేశ సగటు | రూ.1.55 లక్షలు | రూ.90 వేలు |