ఇన్‌స్పిరేషనల్ ఉమన్ ఫార్మర్ ‘లక్ష్మి’

by Shyam |
ఇన్‌స్పిరేషనల్ ఉమన్ ఫార్మర్ ‘లక్ష్మి’
X

దిశ, మానకొండూరు: నాలుగో తరగతి చదివిన ఆమె డిగ్రీ చదివే విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆరేళ్లుగా సాగులో సాధించిన మెలుకువల గురించి వివరిస్తున్నారు. కూలీల కొరత కారణంగా భర్తతో కలిసి పొలంబాట పట్టిన ఆమె ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌గా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన రూపిరెడ్డి లక్ష్మి.. పొలంతో పాటు భావి వ్యవసాయ శాస్త్రవేత్తలను తనవంతు బాధ్యతగా తీర్చిదిద్దుతోంది.

ఆరేళ్ల క్రితం కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో భార్యభర్తలే కష్టపడి వ్యవసాయం చేసేందుకు పొలం పనులు ప్రారంభించారు. ఆ సమయంలో తిరుపతి‌రెడ్డి భార్య లక్ష్మి.. బావిని తవ్వేందుకు క్రేన్ నడిపింది. మెల్లమెల్లగా ట్రాక్టర్‌తో పాటు బైక్ నడపడం నేర్చుకున్న లక్ష్మి.. దుక్కి దున్నడం నుంచి మొదలు మందులు పిచికారి చేయడం వరకు అన్నీ నేర్చుకుంది. ఇక ఆ తర్వాత లక్ష్మీ వ్యవసాయంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. బస్తాల కొద్ది ఎరువులు వాడకాన్ని తగ్గిస్తూ వచ్చింది. ఇప్పుడు సగం బస్తా ఎరువుతోనే పంట పండిస్తున్నది. ధాన్యం సేకరించిన తర్వాత వరి దంట్లు తొలగించడానికి కాల్చకుండా నీటిని పోసి కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధానంతో భూమిని సారవంతం చేయడంలో సక్సెస్ అయింది.

ఏటా రెండు పంటలు పండించి దిగుబడిని పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, పొలాస వ్యవసాయ కాలేజీ, రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రంతో పాటు పలుచోట్ల వరిసాగుపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తోంది. ఇటీవల జాతీయ ఉత్తమ మహిళా అవార్డు అందుకున్న లక్ష్మి తన భర్తకు చేదోడుగా నిలిచేందుకు వ్యవసాయం ప్రారంభించి నేడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకు మెలుకువలు నేర్పిస్తోంది. ఈమెను ఆదర్శంగా తీసుకుని తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఇదే బాటలో పయనిస్తున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఓ కొడుకును బీఎస్సీ అగ్రికల్చర్ చదివించారు లక్ష్మి.

అంతా నా భర్త వల్లే

వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో భర్తతో కలిసి పొలం పనులు చేసేందుకు వెళ్లిన.. నాకు అన్నింటా అవగాహన కల్పించింది మా వారే. క్రేన్, ట్రాక్టర్, బైక్ నడపడం నేర్చుకున్నాను. ప్రధానంగా ఎరువుల వినియోగం తగ్గించి భూమిలో సారం పెంచేందుకు మేం చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అధికారులు నా శ్రమను, పట్టుదలను గుర్తించి నా చేత ఎంతోమందికి అవగాహన కల్పించారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. రాష్ట్రసర్కారు మాత్రం నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం బాధనిపించింది. ఏది ఏమైనా తక్కువగా చదివినా వ్యవసాయంపై నాకున్న మక్కువతో పదిమందికి ఆదర్శంగా నిలవడం మాత్రం సంతృప్తిని ఇస్తోంది.

-రూపిరెడ్డి లక్ష్మి, మహిళా రైతు, జాతీయ అవార్డు గ్రహీత

Advertisement

Next Story

Most Viewed