ఆలివ్ రిడ్లీ.. అరుదైన వన్యప్రాణులకు అండగా చెన్నై మహిళ

by Sujitha Rachapalli |
 ఆలివ్ రిడ్లీ.. అరుదైన వన్యప్రాణులకు అండగా చెన్నై మహిళ
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టేందుకు ఓ చిన్న సంఘటన చాలు అనేందుకు ‘ఆమె’ జీవితమే నిదర్శనం. ఒకనాడు సముద్రపు ఒడ్డున చోటుచేసుకున్న చిన్న ఘటనే నేడు తను అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్‌లో స్థానం పొందేలా చేసింది. ప్రపంచాన్ని మార్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్ లిస్ట్‌లో చేర్చింది. ఇంతకీ ఆ క్లబ్ ఏంటి? అసలు ఆమె ఏం చేసింది? సముద్ర తీరాలు, వన్యప్రాణులపై డాక్టరేట్ చేసిన తను.. అరుదైన వన్యప్రాణి సంరక్షణకు చేసిన కృషి ఏమిటి? ఈ క్రమంలో మాతృభూమి పేరును ఆమె ఏ విధంగా గ్లోబ్‌లో నిలిపింది? వన్యప్రాణులు, సముద్రాల వారసత్వం, సంరక్షణ కోసం భారత్ నిర్విరామంగా కృషి చేస్తున్నదనే సంకేతాన్ని ప్రపంచానికి ఎలా పంపింది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

తమిళనాడు, చెన్నైకి చెందిన సుప్రజ ధరణి.. ఇండియన్ ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేసింది. కళలంటే తనకు అమితమైన ఇష్టం. కళల సంరక్షణ, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ప్రాచీన కళల ఆవశ్యకతను నేటి తరానికి తెలపాలనే ఉద్దేశంతో ‘కళాకృతి’ పేరిట ఓ సంస్థను స్థాపించింది. కానీ, కళల కన్నా పర్యావరణ పరిరక్షణే ముఖ్యమని భావించి, దేశం గర్వించే పర్యావరణ పరిరక్షకురాలిగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ కార్యకర్త జేన్ గుడాల్‌ను ఆదర్శంగా తీసుకుని పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తోంది. ‘ట్రీ ఫౌండేషన్’ సేవలతో గుర్తింపు పొందిన సుప్రజ.. జేన్ గుడాల్‌తో భేటీ అయి, అరుదైన ఆలివ్ రిడ్లీ(సముద్రపు తాబేలు) గురించి ఆమెకు వివరించింది. 2001లో చెన్నైలోని నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఆమెకు గాయాలతో ఉన్న సముద్ర తాబేలు కనపడింది. దానిని క్యూర్ చేద్దామనుకొని పట్టుకునేలోపే చనిపోయింది. ఈ విషయమై పక్కనున్న ఫిషర్‌మెన్‌ను ఆరా తీస్తే, సముద్రపు తాబేళ్లు అలా మరణించడం సర్వసాధారణమే అన్న సమాధానమే వినిపించింది. ఆ ఘటన ఆమెపై తీవ్రప్రభావం చూపగా.. ఎలాగైనా ఈ సముద్ర తాబేళ్లను రక్షించాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది.

వీటిని ఎందుకు పరిరక్షించాలంటే..

సముద్రపు పర్యావరణ పరిరక్షణ, మత్స్యసంపద పునరుత్పత్తిలో ఆలివ్ రిడ్లీ సముద్రతాబేళ్ల పాత్ర కీలకం. సముద్రంలో అలజడి నెలకొన్నప్పుడు, ఆ పరిస్థితులను ఇవి ముందుగానే పసిగడతాయి. ప్రకృతి నేస్తాలైన ఈ జీవుల కదలికలను గమనించి మత్స్యకారులు తమ వేటను ఆపుతుంటారు. అలజడులు ముందుగా గుర్తించి, ఇవి ఒడ్డుకు చేరాయంటే వారు అలర్ట్ అవుతుంటారు. అయితే వీటి సంరక్షణ‌పై మత్స్యకారులకు పూర్తి అవగాహనలేక పట్టించుకునే వారు కాదు. దీంతో క్రమంగా వీటి మరణాల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తున్న సమయంలో మత్స్యకారుల వలలకు చిక్కి చాలావరకు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు సుప్రజ ధరణి ‘ట్రీ(TREE) ఫౌండేషన్’ను స్థాపించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వీటి సంరక్షణకు ఎస్‌టీఎఫ్(STF-Sea Turtle Force) స్టార్ట్ చేసింది. తీరప్రాంత యువకులు, మత్స్యకారులను ఈ ఫోర్స్‌లో భాగం చేస్తూ వారికి సముద్ర తాబేలు ఆవశ్యకతను వివరించింది. ఈ మేరకు సముద్ర తాబేళ్ల గుడ్లు వలలకు చిక్కకుండా భద్రపరుస్తుండటం విశేషం.

ఈ క్రమంలో జిల్లాలో సముద్రతాబేళ్ల సంరక్షణపై కొందరు దృష్టిసారించారు. ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు తీరప్రాంతాల్లో ‘ట్రీ ఫౌండేషన్‌ సంస్థ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక ఎన్‌జీవోలకు అందజేస్తూ వాటి సంరక్షణకు ఒకడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారు నిధులు సమకూర్చి వాటి సంరక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో చేపట్టడంతో పాటు మత్స్యకారుల్లోనూ వీటిపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 61 రోజుల పాటు సముద్రంలో (ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు) వేటను నిషేధించింది. సముద్ర తాబేళ్ల పునరుత్పత్తికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం 2017లో గుర్తించింది. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ సముద్ర తాబేళ్లు ఒడ్డుకు వచ్చి బొరియల్లో గుడ్లు పెడుతుంటాయి. తదుపరి ఆ గుడ్లు 48 – 58 రోజుల లోపు పొదగబడి తాబేళ్లుగా రూపాంతరం చెంది సముద్రంలో‌కి వెళతాయి. కొన్ని సందర్భాల్లో నక్కలు, కుక్కలు వాటిని తినేసే అవకాశముండగా, అప్పుడప్పుడు పక్షులు కూడా తన్నుకు పోతుంటాయి. దీంతో వాటిని సంరక్షించేందుకు ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అంతరించిపోతున్న ఈ సముద్ర తాబేళ్ల సంతతిని పరిరక్షించేందుకు గుడ్లు పొదిగే హేచరీలు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తుగా తాబేళ్లు బొరియల్లో వదిలిన గుడ్లను ఈ సంరక్షకులు, ఎస్‌టీఎఫ్ వాలంటీర్లు జాగ్రత్తగా సేకరించి గుడ్డ సంచుల్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత నిర్ణీత ప్రదేశంలో ఏర్పాటు చేసిన హేచరీలో, నిర్ణీత కొలమానాల ప్రకారం గుంతలు ఏర్పాటు చేసి ఆ గుడ్లను అందులో వదులుతారు. తాబేళ్లు పెద్దగా అయ్యాక గంపలు, ట్రేలలో జాగ్రత్తగా తీసుకెళ్లి సముద్రంలో వదులుతారు. కాగా అరుదైన ఈ సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం సుప్రజ ధరణి తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కృషిని గుర్తించిన అమెరికన్ ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ (Explorers Club).. ప్రపంచాన్ని మార్చే 50 మంది జాబితాలో (50 People Changing the World) ఆమె పేరును చేర్చింది. ఈ లిస్టులో 21 మంది మహిళలుండగా తాను భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడం ఆనందంగా ఉందని 56 ఏళ్ల సుప్రజ ధరణి చెప్పుకొచ్చారు. అరుదైన వన్యప్రాణుల రక్షణ, సముద్ర వారసత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉందనే విషయం తన ద్వారా ప్రపంచానికి తెలపడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

మగ పాము లేకున్నా ముసలి కొండచిలువ గుడ్లు..

Advertisement

Next Story