భర్త వదిలేశాడని అతనితో సహజీవనం చేశా.. నాకు న్యాయం చేయండి

by Anukaran |   ( Updated:2021-11-18 22:53:36.0  )
girijana-mahila1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన మాడకం శారద అనే గిరిజన మహిళ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం దిశ విలేకరితో వివరించింది. వివరాల్లోకి వెళితే.. పినపాక మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన మాడకం శారద అనే గిరిజన మహిళకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. అయితే కొన్ని గొడవల వల్ల ఆమె భర్త ఆమెకు దూరంగా ఇద్దరు పిల్లలను తీసుకొని కొన్నాళ్ల క్రితం వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బతుకుదేరువు కోసం సారపాకకు వెళ్లి ఆమె పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో శారదకు భద్రాచలం ఎట్టపాక మండలానికి చెందిన కట్ట ఆనంద్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడని తెలిపింది. అయితే నిత్యం ఫోన్ చేస్తూ.. నువ్వే అంటే ఇష్టం అంటూ వెంటపడ్డాడని, చేసుకున్న భర్త లేకపోవడంతో కట్ట ఆనంద్ తో సహజీవనం చేశానని ఆమె తెలిపింది. తనతో కట్ట ఆనంద్ 8 నెలలు ఉన్నాడని ఆమె వివరించింది. విషయం ఏమిటంటే కట్ట ఆనంద్ కి వివాహం జరగకపోవడం గమనార్హం.

శారద ఆ పని ఈ పని చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించి కట్ట ఆనంద్ కి ఇచ్చింది. ఆమె సంపాదించిన డబ్బులతో కట్ట ఆనంద్ కు రెండు టచ్ ఫోన్లు, ఒక స్కూటీ, కొంత బంగారం, రూ. 50 వేల నగదు ఇచ్చింది. కొంతకాలం జల్సా చేసిన ఆనంద్ ఎనిమిది నెలల తరువాత నాకు వద్దు అని ముఖం చాటేశాడని శారద తెలిపింది. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానని ఆమె తెలిపింది. ఆ తర్వాత భూర్గంపాహాడ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించానని, కానీ.. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకూ ఆనంద్ ను అదుపులోకి తీసుకోలేదని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తోంది.

దిశ ఫౌండేషన్ సంస్థ మహిళల సెటిల్మెంట్ల హవా…

శారద విషయమై అశ్వాపురం మండలంకి చెందిన దిశ ఫౌండేషన్ సంస్థ మండల అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణకి తెలిసింది. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి విషయమేంటో తెలుసుకుంది. ఈ క్రమంలో శారద తనకు జరిగిన అన్యాయాన్ని ఆమెకు వివరించింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని మద్దెల అన్నపూర్ణను కోరింది. ఇలా మధ్యవర్తిగా వ్యవహరించిన మద్దెల అన్నపూర్ణ కట్ట ఆనంద్ దగ్గర నుంచి శారదకు స్క్యూటీ, రూ. 15 వేల నగదును మాత్రమే ఇప్పించింది. ఈ క్రమంలో మద్దెల అన్నపూర్ణను శారద ప్రశ్నించింది. కట్ట ఆనంద్ నుంచి తన నుంచి తీసుకున్నవన్నీ ఇప్పించలేదని.. అంతేకాకుండా అన్నపూర్ణ మధ్యవర్తిగా వ్యవహరించి తన నుంచి రూ. 5 వేలు వసూలు చేసిందని ఆమె దిశ విలేకరి వివరించింది. తనకు అన్నపూర్ణ కూడా మోసం చేసిందంటూ పేర్కొన్నది. ఇటు కట్టుకున్న భర్త లేక… అటు ఇష్టపడ్డవాడు లేక.. మరోవైపు తల్లి ఇంట్లోకి రానివ్వకుండా.. ఇంకోవైపు దిశ ఫౌండేషన్ సంస్థ అశ్వాపురం మండల అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ అన్యాయం చేయడం.. పదిమంది సూటిపోటి మాటలు అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనపై అన్నపూర్ణ కేసు పెడతానని బెదిరిస్తోంది అంటూ శారద తెలిపింది.

దిశ ఫౌండేషన్ సంస్థ అశ్వాపురం మండల అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణకు దిశ విలేకరి ఫోన్ చేసి వివరణ కోరగా శారదను తీసుకొని మీరు రండి అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. అదేవిధంగా రూ. 30 వేలు సెటిల్మెంట్ చేశామని ఆమె తెలిపింది. రెండు సెల్ ఫోన్లు ఏంటో… బంగారం ఏంటో… మాకు ఏమీ తెలియదు అంటూ ఫోన్ కట్ చేసింది. ఎందుకు సమాధానం చెప్పలేదో అందులో ఆంతర్యం ఏమిటో అన్నది ప్రశ్నగా మారింది. అశ్వాపురం మండలం దిశ ఫౌండేషన్ సంస్థ మహిళలు వసూళ్లకు పాల్పడుతున్నారని మండలంలో జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సెటిల్మెంట్లు ఎక్కడ ఉంటే అక్కడ వీరే ముందు ఉంటున్నారని, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి సపోర్ట్ చేస్తున్నారని మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్న బానోత్ దివ్య.. నేడు మాడకం శారదా… ఇలా ఎవరికీ న్యాయం చేయకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. వీరితోపాటు ఓ పత్రికవిలేకరి ఉండటం గమనార్హం. పత్రిక విలేకరికి, దిశ ఫౌండేషన్ సంస్థకు సంబంధం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దిశ ఫౌండేషన్ సంస్థ మహిళలతో కలిసి ఆ విలేకరి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story