బీజేపీ రామరాజ్యంపై ఇందిరా శోభన్ కౌంటర్

by Shyam |
బీజేపీ రామరాజ్యంపై ఇందిరా శోభన్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను గెలిస్తే కేవలం ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని అబద్ధాలు చెప్పిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటి పేరులోనే ధర్మపురి ఉందని, నిజానికి ఆయన అధర్మపురి అర్వింద్ అని షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‎లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అర్వింద్‎కు ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు రాదనే విషయం కూడా తెలియకుండా హామీలిచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దొంగ సర్టిఫికెట్లు ఉన్న అతడికి షర్మిల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిలకు అవగాహన లేదనడం తన అజ్ఞానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామన్నరాజ్యం ఎవరికైనా తెలుసా..

రామన్న రాజ్యాన్ని ఇప్పటివరకు ఎవరైనా చూశారా అంటూ ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు. అదే రాజన్న రాజ్యాన్ని అందరూ చూశారని, ప్రజలందరూ ఆయన హయాంలో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రామన్న రాజ్యమే ఉంది.. అయినా మహిళలపై ఆకృత్యాలు ఆగాయా అంటూ ఇందిరాశోభన్ నిలదీశారు. బీజేపీ హయాంలో ధరలు విపరీతంగా పెంచి ప్రజలను మభ్య పెడుతున్నారని, రామరాజ్యంలో ప్రజలంతా అధోగతి వైపు పయనిస్తున్నారని ఆమె అభివర్ణించారు. పేదోళ్లను కొట్టి పెద్దోడికి పెట్టడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందన్నారు.

Advertisement

Next Story