7 నెలల గరిష్ఠానికి మార్కెట్లు

by Harish |   ( Updated:2020-10-08 06:50:55.0  )
7 నెలల గరిష్ఠానికి మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాలను నమోదు చేశాయి. స్టాక్‌మార్కెట్లో ఉదయం నుంచి మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో మార్కెట్లు 7 నెలల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు, దేశీయంగా ప్రభుత్వ రెండో ఉద్దీపన ప్యాకేజీ అంచనాలు తోడవడం, విదేశీ మదుపర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించడంతో మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 303.72 పాయింట్లు ఎగసి 40,182 వద్ద ముగియగా, నిఫ్టీ 95.75 పాయింట్లు లాభపడి 11,834 వద్ద ముగిసింది. ప్రారంభ సమయంలో ఒడిదుడుకులకు లోనైనట్టు కనిపించినప్పటికీ తర్వాత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు డిమాండ్ పెరిగింది. మదుపర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో సెన్సెక్స్ 40 వేల మార్కును దాటింది. ముఖ్యంగా ఐటీ కౌంటర్లలో భారీ లాభాల సందడి కనబడింది.

నిఫ్టీలో ఐటీ రంగం 3 శాతానికి పైగా పుంజుకోగా, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగాలు బలపడ్డాయి. మీడియా రంగం స్వల్పంగా నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.24 వద్ద ఉంది.

Advertisement

Next Story