వ్యవసాయ బిల్లులు 'లోప భూయిష్టం' : కౌశిక్ బసు

by Harish |
వ్యవసాయ బిల్లులు లోప భూయిష్టం : కౌశిక్ బసు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు లోపభూయిష్టం’ అని, ఈ సంస్కరణలు ‘రైతులకు హానికరం’ అని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్శిటీలో ఎకనమిక్ ప్రొఫెసర్ అయిన కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. కొత్త వ్యవసాయ బిల్లుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కొత్త చట్టం రైతుల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఎక్కువ ఉపయోగపడుతుందని ట్విటర్ ద్వారా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ‘ఈ మధ్యే భారత్‌లో తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను అధ్యయనం చేశాను.

అవి లోపభూయిష్టంగా ఉన్నాయని, రైతులకు హానికరంగా ఉంటాయని గ్రహించాను. వ్యవసాయ రంగంలో నియంత్రణలకు మార్పు అవసరం. కాని ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు రైతుల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఎక్కువ సేవలందిస్తాయని’ స్పష్టం చేశారు. భారత మాజీ ఆర్థిక సలహాదారైనా కౌశిక్ బసు వ్యాఖ్యలకు మరింతమంది ఆర్థికవేత్తల నుంచి మద్దతు లభించింది. ఆయన మాటలను సమర్థిస్తూ స్పందించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో రైతులతో చర్చలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను తిరస్కరిస్తూ రైతుల నిరసనలు 16వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల నిరసనలను ముగించాలని, ప్రభుత్వం రైతుల అభ్యర్థనలను స్వీకరించి మార్పులకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ రైతులు వ్యవసాయ బిల్లులను రద్దు చేయడమే లక్ష్యంగా నిరసనలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. పలువురు ఆర్థికవేత్తలు వారికి మద్దతు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed