- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంపెనీల ఫలితాలపైనే మార్కెట్ల పరిస్థితి!
దిశ, వెబ్‌డెస్క్ : గత ఐదు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు అనేక ఒడిదుడుకులను చూశాయి. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ ప్రకటన అనంతరం మార్కెట్లు ఊహించని స్థాయిలో పతనానికి గురయ్యాయి. తర్వాత జులై చివరినాటికి కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, మార్కెట్లో కొంత చలనం వచ్చింది. కరోనాకు ముందు నాటి స్థాయిలో 50 శాతం రికవరీని సాధించాయి. అయితే, మార్చిలో ఉన్న దానికంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నా… మార్కెట్లు ఆ స్థాయి పతనాన్ని చూడలేదు. అలాగే, భారీ స్థాయిలో లాభాలను కూడా నమోదు చేయలేదు. ఓ దశలో 600 పాయింట్ల వరకు లాభాలను చూసినప్పటికీ.. చివరి గంట పరిణామాలతో 300 పాయింట్లకు పరిమితమవుతున్నాయి.
అయితే, మార్చి నుంచి జూన్ మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అనేక కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. వీటిలో నిఫ్టీ ఇండెక్స్‌లోని 47 కంపెనీలు ఫలితాలను ప్రకటించాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీల మొత్తం ఆదాయం 40 శాతం క్షీణించాయి. అయితే, దేశీయంగా ఉన్న పలు సంస్థలు ఈ త్రైమాసికానికి దారుణమైన ఫలితాలను నమోదు చేస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆయా సంస్థల అంచనాలను అధిగమిస్తూ మెరుగైన ఫలితాలను కంపెనీలు ఇవ్వగలిగాయి. ఇందులో కొన్ని కంపెనీలు గతం కంటే మంచి లాభాలను నమోదు చేయగలిగాయి కానీ వాటి సంఖ్య 10 కంటే తక్కువగానే ఉన్నాయి.
రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన ఆశాజనక ఫలితాలు, మార్కెట్ పోకడ ఉంటుందని అంచనా వేయడం కొంత కష్టమేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో కంపెనీ ఆర్థిక ఫలితాలు ఇదే స్థాయిలో కొనసాగగలిగితే పర్లేదు. కానీ, ప్రతికూలత నమోదైతే మాత్రం మూలధన మార్కెట్లో భారీగా దిద్దుబాటు చర్యలు తప్పదని నిపుణులు చెబుతున్నారు. మార్చి తర్వాత సానుకూలంగా ఉన్న మార్కెట్లు ఇదే స్థాయిలో కొనసాగాలంటే కంపెనీల ఆదాయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఆర్థిక వేత్తలు చెబుతున్న దాని ప్రకారం…ప్రస్తుత ఏడాదిలో కంపెనీల ఆదాయం 2020-21 ఆర్థిక సంవత్సరానికి మెరుగుపడతాయని భావిస్తున్నారు.
మార్కెట్ల నుంచి లాభాలను ఆశించడం కుదరదని ఆర్థికవేత్తలు అంచనా. కానీ, కంపెనీలు ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ షీట్లను నిలకడగా కొనసాగిస్తున్నాయి. ఈ పరిణామాలు మార్కెట్లకు కలిసి వచ్చే అవకాశమని, మరీ ఊహించిన స్థాయిలో భయపడాల్సిన అవసరంలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు, సరైన సమయంలో వర్షపాతం, అగ్రి ఉత్పత్తి అంచనాలు ఉన్నాయి కాబట్టి నిరాశ పడాల్సిన అవసరంలేదని వారంటున్నారు. ఇన్వెస్టర్లు అనుకున్నంత ఆందోళన పడనవసరంలేదని సూచిస్తున్నారు.
ఏ రంగంలో ఎలాంటి ఫలితాలున్నాయి…?
ప్రస్తుత సంవత్సరం తొలి త్రైమాసికంలో నాలుగు అతిపెద్ద ఐటీ కంపెనీలు భారీ ఆదాయాన్ని ఆర్జించగలిగాయి. కరోనా వల్ల టెక్నాలజీ అవసరం విపరీతంగా పెరిగింది. ముప్పావు వంతు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండటం వల్ల కంపెనీల ఖర్చులు తగ్గాయి. ఈ కారణాలతోనే కంపెనీలు 2013 తర్వాత అధిక లాభాలను సాధించగలిగాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఇదే ట్రెండ్ రానున్న రోజుల్లో కొనసాగవచ్చని, డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో మార్కెట్లలో ఐటీ రంగానికి ఢోకా లేదని నిపుణులు భావిస్తున్నారు.
ముఖ్యంగా, ఫార్మా రంగం ఈ ఆర్థిక సంవత్సరాన్ని మంచి లాభాలతో ప్రారంభించింది. కరోనా ప్రభావంతో డిమాండ్ అధికంగా ఉన్నందున లాభాలు కూడా భారీగా ఉంటాయని, ఫార్మా రంగంలో పెట్టుబడులతో మెరుగైన రిటర్న్స్ సాధించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు వినియోగదారు ఉత్పత్తుల రంగంలోని కంపెనీలు అవసరానికి తగినట్టు ఉత్పత్తిని భారీగా పెంచాయి. గ్రామీణ భారతంలో సేల్స్ పెరిగాయి. కన్జ్యూమర్ రంగంలో గతేడాది కంటె ఈసారి 36 శాతం అమ్మకాలు పెరిగాయి. దేశీయ దిగ్గజ కంపెనీ బ్రిటానియా కంపెనీ ఏకంగా 117 శాతం వృద్ధిని సాధించింది.
ఇక, బ్యాంకింగ్ రంగంలో గతేడాది కంటే ఈసారి ఆదాయం తగ్గింది. కరోనా ప్రభావం అత్యధికంగా ఈ రంగంపై ఉందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్ ఎస్‌బీఐ వాటాలను విక్రయించి బ్యాలెన్స్ షీట్లను సరిచేయాల్సి వచ్చింది. ప్రైవేట్ బ్యాంకులు సైతం సంస్థాగత నిధులను సమీకరించుకునే పనిలో పడ్డాయి. కాబట్టి, ప్రస్తుత పరిస్థితులలో బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు దూరం ఉండటం మేలని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగని, భారీస్థాయిలో పతనం ఉండదని, ఊగిసలాట ఉంటుందంటున్నారు.
ఆర్‌బీఐ నివేదిక బ్యాంకుల ఎన్‌పీఏలు పెరుగుతాయనే సంకేతాలతో బ్యాంకుల భవిష్యత్తు ఉండనుంది. టెలికాం రంగంలోనూ ఆదాయం తగ్గింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు రావడం ఆ కంపెనీకి కలిసొచ్చింది. అయితే, రిలయన్స్ సంస్థ షేర్లను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌లో ఉంచాయి. కాబట్టి..అంచనాలు పెరగడం వల్లే పనితీరు బాగుందని, పెట్టుబడుల వల్లే కంపెనీ బూమ్ అయిందని, ఫలితాలు మారొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఫ్లాట్‌గా ఆటో పరిశ్రమ…
ఇక చివరగా, ఆటో రంగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయింది. దేశీయ దిగ్గజ కంపెనీ అయిన మారుతీ సుజుకి ( చరిత్రలోనే తొలిసారి జూన్ త్రైమాసికానికి నష్టాలను ప్రకటించింది. ఇక, ద్విచక్ర వాహన కంపెనీలు కూడా సాధారణ స్థితికి వచ్చాయి. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత ఈ కంపెనీల భవిష్యత్తును నిర్ణయించనుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఆటో రంగం షేర్లు ఫ్లాట్‌గా ఉండటంతో..షేర్లు పుంజుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు మార్కెట్ నిపుణులు తెలిపాయి.
కార్యకలాపాలు పునరుద్ధరణ దిశగా సాగుతుండటంతో ఆటో విడిభాగాల పంపిణీ సంస్థలు మార్కెట్లో సత్తా చూపించే అవకాశాలున్నాయి. మొత్తంగా, కొవిడ్-19 తీవ్రతను బట్టే ఆయా రంగాల షేర్లు ట్రేడవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది చివరి వరకూ ఏ షేర్లు అయినా భారీ లాభాలను నమోదు చేయకపోవచ్చని, స్వల్పంగా తగ్గుతాయనే అంచనాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 2022 వరకు సాధారణ స్థితిని ఆశించకపోవడం ఉత్తమమని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.