బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది.. గుజరాత్ నుంచే ప్రారంభం

by Anukaran |
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది.. గుజరాత్ నుంచే ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీ డ్రీం ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం కావడంతో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ నిర్మాణ పనులను ఇండియన్ రైల్వే దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వైకె యాదవ్ తెలిపారు.

రైతు సంఘాలు, రాష్ట్రప్రభుత్వం నుండి వచ్చిన నిరసనల కారణంగా మహారాష్ట్రలో కారిడార్ పనులు అడ్డంకిగా మారాయని అన్నారు. అయినప్పటికీ గుజరాత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ఈ బుల్లెట్ ప్రాజెక్ట్‌ను తొలిఫేజ్ కింద అహ్మదాబాద్ నుంచి వాపి వరకు కారిడార్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని యాదవ్ చెప్పారు. రాబోయే నాలుగు నెలల్లోనే 80% భూసేకరణ పనులు పూర్తిచేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం.., కేంద్రానికి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

మహారాష్ట్రలో పల్ఘర్ వంటి కొన్ని ప్రాంతాలలో ప్రజలు మరియు రాజకీయ పార్టీల వ్యతిరేకత కారణంగా భూసేకరణ సమస్యగా మారిందన్న ఆయన.., మహారాష్ట్రలోని మహా-వికాస్ అఘాడి కూటమి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. ఈప్రాజెక్ట్‌ను మహరాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని,దీంతో ఈ ప్రాజెక్ట్‌ను అమలుచేయడానికి ఏర్పాటు‌చేసిన స్పెషల్‌పర్పస్‌వెహికల్ (ఎస్‌పివి) కు సహకరించలేదన్నారు.

కాగా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్ట్ 2023నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దేశంలోనే తొలి అత్యంత భారీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎల్ అండ్ టీ మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకొని దేశంలోనే అతిపెద్ద సివిల్ కాంట్రాక్ట్‌‌గా ఇది రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed