కరోనా రైలు.. ప్రత్యేకతలు ఇవే..

by Shamantha N |   ( Updated:2020-07-14 10:05:44.0  )
కరోనా రైలు.. ప్రత్యేకతలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. వాటి మూలంగా ప్రజలు తీవ్ర ఆందోళన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించి రైళ్లు, బస్సులు రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు కొంతమేర మెరుగుపడటంతో కొన్ని చోట్ల రైళ్లు, బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తొలి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ను సిద్ధం చేసింది. ఈ రైల్వే కోచ్ ఇన్నాళ్లూ మనం చూసిన రైలు బోగీలా ఉండదు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రైలు బోగీ ఇది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న ‘పోస్ట్ కోవిడ్ కోచ్’లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ ఎలా ఉంటుందన్న వీడియోను భారతీయ రైల్వే తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇదే.

‘పోస్ట్ కోవిడ్ కోచ్’లో అన్నీ ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. వాష్ బేసిన్ దగ్గర్నుంచి వాష్ రూమ్ వరకు ఎక్కడా చేతితో తాకాల్సిన అవసరం లేకుండా బోగీని రూపొందించింది రైల్వే. వాటర్ ట్యాప్, సోప్ డిస్పెన్సర్, వాష్‌రూమ్ డోర్, ఫ్లష్ వాల్వ్ లాంటివాటిని కాలితోనే ఆపరేట్ చేయొచ్చు. హ్యాండిల్స్‌కు కాపర్ కోటింగ్, టైటానియం డయాక్సైడ్ కోటింగ్‌ ఉంటుంది. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తులు వాటిని తాకినా వైరస్ కొన్ని గంటల్లో చనిపోతుంది. కాపర్‌కు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ అయినా ఎక్కువ సేపు ఉండదు. ఏసీ కోచ్‌లో ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫైర్‌ ఉంటుంది. గాలిలో, ఉపరితలాలపై క్రిములను అంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణికులకు కరోనా వైరస్‌ సోకే అవకాశమున్న ప్రతీ చోటా రైలు బోగీలో రైల్వేశాఖ మార్పులు చేసింది.

Advertisement

Next Story