కేన్స్ రెడ్‌కార్పెట్‌పై బ్రెస్ట్‌ పంప్స్‌తో ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోజులు

by Shyam |   ( Updated:2021-07-10 05:50:53.0  )
life-style
X

దిశ, ఫీచర్స్ : బిడ్డకు పాలివ్వడం మాతృత్వపు వరం. బేబీ ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లి పాలను మించిన అమృతం, ఔషధం లేవన్నది వాస్తవం. ఈ క్రమంలోనే ఇండియన్ ఇన్‌‌ఫ్లుయెన్సర్ దీప ఖోస్లా బ్రెస్ట్ ఫీడింగ్‌పై అందరిలో అవగాహన కల్పించేందుకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికను ఉపయోగించింది. రెడ్ కార్పెట్‌పై బ్రెస్ట్ పంప్స్‌తో ఫొటోలకు పోజులిచ్చి అందరీ అటెన్షన్ డ్రా చేసింది.

ప్రపంచ అతిపెద్ద ఫిలిం ఫెస్టివ‌ల్‌గా పేరొందిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ప్రతీ ఏడాది మే నెల‌లో జ‌రుగుతుందని తెలిసిన విషయమే. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభనతో గతేడాది ఈ ప్రొగ్రామ్ ఆన్‌లైన్ వేదికగా జరగ్గా, ఈ ఏడాది మే 11-22 తేదీల మ‌ధ్య జరగాల్సిన ఈ ఫెస్టివల్ జూలై 6 – 17 తేదీల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్టిజీయస్ ఫెస్టివల్‌‌ రెడ్ కార్పెట్‌పై నడవడానికి ప్రముఖ సెలబ్రిటీలంతా తహతహలాడుతుంటారు. బాలీవుడ్ బ్యూటీలు సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, కేన్స్ స్టైల్ వెటరన్ ఐశ్వర్య రాయ్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంకలు రెడ్‌కార్పెట్‌పై నడిచి హొయలు పోయారు. ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్‌కు ఇన్‌ప్లుయెన్సర్స్ మసూమ్ మినావాలా, దీపా బుల్లెర్-ఖోస్లాలు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్లాక్ అండ్ ఎల్లో ఔట్‌ఫిట్‌లో మెరిసిన దీపా ఖోస్లా, తన గౌనుకే బ్రెస్ట్ పంప్స్ అమర్చడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖోస్లా తన కుమార్తెకు జన్మనివ్వగా, ‘బ్రెస్ట్ ఫీడింగ్’ గురించి ఆమెపై వచ్చిన ట్రోల్స్, కామెంట్స్‌కు బదులుగా ఈ సమస్యపై గళం వినిపించాలనుకుంది. అందుకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆమె వేదికగా చేసుకుని, తన స్పెషల్ డ్రెస్‌తో అందరికీ మెసేజ్ పాస్ చేసింది.

సాంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించిన దీపా ఖోస్లా, ఊటీలోని బ్రిటిష్ బోర్డింగ్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. నెదర్లాండ్‌లో న్యాయవిద్యను అభ్యసించిన దీపా, ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులేసి అక్కడ తన సత్తా చాటింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గానూ ప్రతిభ చూపించి అనేక బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది. వోగ్, ఎల్లే, గ్రాజియా వంటి ప్రముఖ సంస్థల నుంచి వరుసగా మూడు సంవత్సరాలు ఆమె ఇన్‌ఫ్లూయెన్సర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. కేన్స్, వెనిస్ చిత్రోత్సవాల ఆహ్వానం అందుకున్న దీపా, పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్‌ను కూడా ప్రారంభించింది. ఇది సోషల్ మీడియా ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేయడంతో పాటు, మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది.

‘మాతృత్వానికి రూల్ బుక్ లేదు. తల్లిగా మీకు సముచితమైన పనులు చేస్తున్నప్పుడు జరిగే ఆయా లోపాలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ పోవాలి. అది అనుభవంతో మాత్రమే వస్తుంది. తల్లిగా ఒకరి నిర్ణయాలను జడ్జ్ చేసే అవకాశం ఎవరికీ లేదు. తల్లి కావడం అంటే మీరు ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వ్యక్తికి బాధ్యత వహించడం. జీవితాంతం అంతులేని ప్రేమను అందించడం. నేను నా కుమార్తెకు తల్లి పాలు ఇస్తున్నానో లేదో? అనే అంశం నా పర్సనల్. ఎవరో దాని గురించి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మేము కూడా మనుషులమే? మా జీవితం, భావాలు తెరవెనక వేరుగా ఉంటాయి. మాతృత్వపు అందమైన ప్రయాణంలో ఉన్న ఏ తల్లి గురించి అయినా మీరు అనవసర జడ్జ్‌మెంట్ పాస్ చేసి వారిని బాధపెట్టకండి. ఇది తల్లి, బిడ్డల మధ్య వ్యక్తిగత ప్రయాణం’

– దీపా ఖోస్లా

Advertisement

Next Story