భారత్‌లోనే రక్షణ సామాగ్రి తయారీ: కేంద్ర రక్షణ మంత్రి

by Shamantha N |   ( Updated:2021-12-18 06:59:13.0  )
భారత్‌లోనే రక్షణ సామాగ్రి తయారీ: కేంద్ర రక్షణ మంత్రి
X

న్యూఢిల్లీ: సాయుధ దళాలకు సంబంధించిన ఆయుధ సామాగ్రిని భారత్‌లోనే తయారు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంపై యూఎస్, రష్యా, ఫ్రాన్స్‌లతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చామని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కి) వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. రక్షణ రంగంలో యూఎస్, రష్యా, ఫ్రాన్స్‌లతో పాటు చాలా దేశాలు భారత్‌కు సాయంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత సాయుధ దళాలకు కావాల్సిన మిలిటరీ సామాగ్రి భారత్‌లోనే తయారవుతుందని అన్నారు.

భారత్‌కు వచ్చి, పెట్టుబడులు పెట్టి ఇక్కడే తయారు చేయాలని ఆయన ఇతర దేశాలకు పిలుపునిచ్చారు. దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి 209 సైనిక పరికరాలను దిగుమతి చేసుకోకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రక్షణ మంత్రి ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ వస్తువుల జాబితా 1,000 వరకు చేరుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.85,000 కోట్ల రక్షణ, వైమానిక తయారీ రంగం ఉందని, 2022 కల్లా రూ.లక్ష కోట్లకు చేరవచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. 2024 కల్లా ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి హెలికాప్టర్లు, జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణిలు, సోనార్ వ్యవస్థలతో పాటు ఇతర ఆయుధాల దిగుమతులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49శాతం నుంచి 74 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed