వన్డే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం.. మిథాలీ శ్రమ వృథా

by Shyam |
England
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు వరుస ఓటములతో సతమతం అవుతున్నది. ఆతిథ్య ఇంగ్లాండ్ మహిళా జట్టు ఇప్పటికే ఏకైక టెస్టును కైవసం చేసుకున్నది. ఇక తొలి వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్… రెండో వన్డేలో కూడా అదే ఫామ్ కొనసాగించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ అర్ద సెంచరీతో మెరిసినా.. కేట్ క్రాస్ అద్భుత బౌలింగ్‌తో టీమ్ ఇండియాను కుప్పకూల్చింది. ఇక టాపార్డర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సమయంలో పోషియా డంక్లే అర్ద సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో వన్డే మిగిలి ఉండగానే ఇంగ్లీష్ వుమెన్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్నారు.

టాంటన్ కౌంటీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన రెండో డేనైట్ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మధ్యలో కాస్త తడబడినా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (10) త్వరగానే వికెట్ పారేసుకున్నది. జులన్ గోస్వామి బౌలింగ్‌లో ఆమె క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాత కెప్టెన్ హీథర్ నైట్ (10), నాట్ షివర్ (19) ఆశించిన మేర రాణించలేదు. మరో ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ-హిల్ (42) మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఆమీ జోన్స్ (28) కాసేపు క్రీజులో పోరాడింది. కానీ భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే 5 టాపార్డన్ వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సోఫియా డంక్లీ, కేథరిన్ బ్రంట్ పోరాడారు.

ముఖ్యంగా ఇటీవలే జట్టులో చోటు సంపాదించిన సోఫియా డంక్లీ (73) భారత బౌలర్లపై ఎదురు దాడి చేసింది. తొలుత వికెట్ కాపాడుకోవడానికి క్రీజులో సమయం వెచ్చించిన డంక్లీ ఆ తర్వాత కేథరిన్ (33) సాయంతో పరుగులు రాబట్టింది. వీరిద్దరూ అజేయంగా 6వ వికెట్‌కు 92 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నది. కేట్ క్రాస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకు ముందు భారత జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. స్మృతి మంధాన (22)ను కేట్ క్రాస్ బౌల్డ్ చేసి వీరి జోడీని విడగొట్టింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (8) తక్కువ స్కోరుకే అవుటైయ్యింది. అయితే యువ సంచలనం షెఫాలీ వర్మ మాత్రం దూకుడుగా ఆడింది. అర్ద సెంచరీకి చేరువ అవుతున్న షెఫాలీ (44) ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో జోన్స్‌ స్టంపింగ్ చేయడంతో అవుటయ్యింది. కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికిప్రయత్నించారు. వీరిద్దరూ కలసి 4వ వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని కేట్ క్రాస్ విడదీసింది. హర్మన్ ప్రీత్ కౌర్ (19) కేట్ క్రాస్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. ఇక అక్కడి నుంచి మిథాలీ రాజ్ ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు మరో ఎండ్‌లో సపోర్ట్ దొరకలేదు. భారత జట్టు మిడిల్, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్ మిథాలీ రాజ్ (59)తో పాటు చివర్లో జులన్ గోస్వామి(19), పూనమ్ పాండే (10) కాస్త పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత మహిళా జట్టు 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేట్ క్రాస్ 5, సోఫీ ఎక్లిస్టోన్ 3 వికెట్లు తీయగా నాట్ షివర్ ఒక వికెట్ తీసింది.

స్కోర్ బోర్డు : ఇండియా

స్మృతి మంధాన (బి) కేట్ క్రాస్ 22, షెఫాలి వర్మ (స్టంప్) జోన్స్ (బి) సోఫి ఎక్లిస్టోన్ 44, జెమీమా రోడ్రిగ్స్ (సి) కేథరిన్ బ్రంట్ (బి) కేట్ క్రాస్ 8, మిథాలీ రాజ్ (రనౌట్) 59, హర్మన్ ప్రీత్ కౌర్ (సి)అండ్(బి) 19, దీప్తి శర్మ (సి) సోఫియా డంక్లీ (బి) కేట్ క్రాస్ 5, తానియా భాటియా (సి) జోన్స్ (బి) సోఫీ ఎక్లిస్టోన్ 2, శిఖా పాండే (సి) జోన్స్ (బి) నాట్ షివర్ 2, జులన్ గోస్వామి 19 నాటౌట్, పూనమ్ యాదవ్ (బి) సోఫీ ఎక్లిస్టోన్ 10; ఎక్స్‌ట్రాలు 26, మొత్తం (50 ఓవర్లు) 221 ఆలౌట్

వికెట్ల పతనం : 1-56, 2-76, 3-77, 4-145, 5-160, 7-178, 8-181, 9-192, 10-221

బౌలింగ్ : కేథరిన్ బ్రంట్ (10-0-55-0), అన్యా షర్బ్‌సోల్ (8-1-31-0), సోఫీ ఎక్లిస్టోన్ (10-2-33-3), కేట్ క్రాస్ (10-0-34-5), నాట్ షివర్ (7-0-27-1), సారా గ్లెన్ (5-0-29-0)

ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు

లారెన్ విన్‌ఫీల్డ్-హిల్ (సి) తానియా భాటియా (సి) శిఖా పాండే 42, టామ్ బ్యూమౌంట్ (బి) జులన్ గోస్వామి 10, హీథర్ నైట్ (సి) జులన్ గోస్వామి (బి) పూనమ్ యాదవ్ 10, నాట్ షివర్ (సి) తానియా భాటియా (బి) స్నేహ్ రాణా 19, ఆమీ జోన్స్ (సి)(సబ్) ఆర్పీ యాదవ్ (బి) పూనమ్ యాదవ్ 28, సోఫియా డంక్లీ 73 నాటౌట్, కేథరిన్ బ్రంట్ 33 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లు) 225/5

వికెట్ల పతనం : 1-16, 2-48, 3-82, 4-92, 5-133

బౌలింగ్ : జులన్ గోస్వామి (10-0-39-1) శిఖా పాండే (9-1-34-1), దీప్తీ శర్మ (8.3-0-41-0), పూనమ్ యాదవ్ (10-0-63-2), స్నేహ్ రాణా (10-0-43-1)

Advertisement

Next Story

Most Viewed