ఆస్ట్రేలియా పర్యటన పై సందిగ్ధత..!

by  |
ఆస్ట్రేలియా పర్యటన పై సందిగ్ధత..!
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL) ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా(Australia) పర్యటనకు వెళ్లాల్సి ఉంది. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య నాలుగు టెస్టులు, మూడు నుంచి ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket australia)కు భారత జట్టు పర్యటన కీలకంగా మారింది. భారత్‌తో సిరీస్ ఆడటం వల్ల 150 మిలియన్ డాలర్ల (రూ. 110 కోట్లు) ఆదాయాన్ని అంచనా వేసింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియాకు అధికార బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న సెవెన్ వెస్ట్ మీడియా (Seven west media) తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు లేఖ పంపింది.

కోవిడ్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడం, ఆస్ట్రేలియా తమ భవిష్యత్ షెడ్యూల్ (Future schedule) ప్రకటించకపోవడంతో పాటు పలు జట్లు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సెవెన్ వెస్ట్ మీడియా లేఖలో పేర్కొంది. గ్యాలరీల్లో ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడించాలని భావించడం వల్ల ఆటలో మజా పోతున్నదని, స్టార్ క్రికెటర్లు కూడా కొన్నాళ్ల పాటు ఆటకు దూరమవడం వల్ల టీవీల్లో ప్రేక్షకులు చూడటం లేదని, దాని వల్ల టీఆర్పీలు రావడం లేదని సెవెన్ చెబుతున్నది. అందుకే తమ కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు లేఖలో క్రికెట్ ఆస్ట్రేలియాకు వివరించింది.

భారత జట్టు పర్యటనకు ఆటంకం..

క్రికెట్ ఆస్ట్రేలియా సంక్షోభం (Crisis) భారత జట్టు పర్యటనపై పడే అవకాశం ఉంది. రేపోమాపో షెడ్యూల్ ప్రకటిద్దామని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్న తరణంలో సెవెన్ వెస్ట్ మీడియా లేఖ ఎదురు దెబ్బ తీసింది. వాస్తవానికి వచ్చే మంగళవారం సెవెన్ వెస్ట్ మీడియా తమ లైసెన్సు ఫీజులో 25 మిలియన్ డాలర్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బ్రాడ్ కాస్ట్ ఒప్పందం రద్దు చేసుకుంటామని చెబుతుండటంతో ఆ వాయిదా చెల్లిస్తుందో లేదో తెలియడం లేదు. సెవెన్ కనుక వచ్చే వారం వాయిదా చెల్లించకుంటే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లే భావించాలి.

అదే జరిగితే బ్రాడ్ కాస్టర్ (Broad caster) లేకుండా భారత జట్టు పర్యటన నిర్వహించడం కష్టమే. ప్రస్తుత సంక్షోభ సమయంలో కొత్త బ్రాడ్ కాస్టర్‌ను వెదికి పట్టుకోవడం అంత సులభమేమీ కాదు. భారత జట్టు పర్యటన ద్వారా అంచనా వేసిన రూ. 110 కోట్లలో సగ భాగం బ్రాడ్‌కాస్టర్ ద్వారానే రావాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేయబోతున్నదనేది ప్రశ్నార్థకంగా మారింది.

Read also…

కరోనాకు వాళ్లు భయపడరు : గంభీర్


Next Story

Most Viewed