- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాజాన్ని మేల్కొలిపే ప్రేమకథలు..
దిశ, వెబ్‌డెస్క్ : జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అందరూ ప్రేమలో పడే ఉంటారు. అయితే వయసు, కాలంతో సంబంధం లేకుండా పుట్టే ఈ ప్రేమకు కుల, మతాల పట్టింపులే కాదు.. ఆస్తి, అంతస్తుల భేదాలు కూడా ఉండవు. ఇక ప్రేమ తలపులు ఒక్కచోట కుదురుగా ఉండనియ్యవు. ఊసులెన్నో చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రేమించిన వ్యక్తి చేయి పట్టుకుని జీవితాంతం నడవాలని కోరుకుంటారు. కానీ ‘ప్రేమ’కు ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. సమాజం ‘ప్రేమ’కు కులం, మతం రంగులు పులుముతుంది. ఉన్నోళ్లు, లేనోళ్లనే తారతమ్యాలను తక్కెట్లో తూకమేస్తుంది. విడదీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ వీటన్నింటినీ దాటుకొని, సమాజాన్ని ఎదిరించి మనుషులుగా ‘ప్రేమ’ను గెలిపించుకున్న జంటలెన్నో. అలా తమ ప్రేమను బతికించుకొని, ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ఆనందమయ జీవితాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని అనుభవిస్తున్న భార్యాభర్తలు అనేకం. అలాంటి జంట కథలను సమాజం ముందుంచడానికి ఇటీవలే ఇన్‌స్టాలో ‘ఇండియా లవ్ ప్రాజెక్ట్’ అనే అకౌంట్ ప్రారంభమైంది.
2006లో సుప్రీంకోర్టు ఓ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ‘మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందరూ స్వతంత్రంగా ఉండొచ్చు. ఓ వ్యక్తి మేజర్ అయిన తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు’ అన్నది ఆ తీర్పు సారాంశం. ఆ జడ్జ్‌మెంట్ వచ్చి 14 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ సమాజంలో విద్వేషపూరిత సంప్రదాయమే కొనసాగుతోంది. ఇంటర్‌ఫేత్, ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లపై ప్రజలు విషపూరిత భావనతోనే ఉన్నారు. ఇలాంటి పెళ్లిళ్ల గురించి మాట్లాడేందుకు, వాటిని యాక్సెప్ట్ చేసేందుకు ఇంకా సంకోచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ వైపు ‘పరువు హత్య’లు చోటుచేసుకుంటుండగా, మరోవైపు రోజుకో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉంది. అయితే ఇలాంటి సమాజంలోనే కుల మతాల అడ్డుగోడలను ధిక్కరించి స్వేచ్ఛగా తాము కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు. అలాంటి స్వచ్ఛమైన ‘ప్రేమకథ’లు మధురిమలను ఆస్వాదించాలంటే ‘ఇండియా లవ్ ప్రాజెక్ట్’ ఇన్‌స్టా అకౌంట్ చూడాలి. అప్పుడైనా మనం కుల, మతాల రంగులతో పురుడు పోసుకోలేదని, రక్తమాంసాలతో జన్మించామనే విషయం అవగతమవుతుందేమో. ఈ ఇన్‌స్టా అకౌంట్‌ను రచయిత నీలోఫర్ వెంకట్రామన్‌తో కలిసి జర్నలిస్ట్‌లు దంపతులు సమర్ హలంకార్, ప్రియా రమణి ఇటీవలే ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ను మరికొద్ది కాలం తర్వాత ప్రారంభించాలనుకున్నా.. ఇటీవల చెలరేగిన ఓ వివాదమే ‘ఇండియా లవ్ ప్రాజెక్ట్’ను వెంటనే మొదలు పెట్టేలా చేసింది. ఆ వివాదమే తనిష్క్ ఏకత్వం యాడ్.
తనిష్క్ తమ ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిరీస్‌లో భాగంగా రూపొందించిన ఓ ప్రకటనలో ఒక ముస్లిం అత్తగారు హిందూ కోడలికి సీమంతం చేస్తుంది. అయితే ఈ ప్రకటన ‘లవ్ జిహాద్’ను ప్రోత్సహించేలా ఉందని ఎంతోమంది ఆరోపించారు. అలానే ఇందులో తప్పేం లేదని వాదించిన వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దేన్నయినా భూతద్దంలో పెట్టి చూడకూడదు. 100 మందిలో 51 మంది ఓ విషయానికి ఓటు వేశారనుకుందాం. కానీ అదే విషయాన్ని 49 మంది వ్యతిరేకించారని కూడా చెప్పొచ్చు. ఏది కూడా 100 శాతం ఆమోదం పొందదు. ఆ యాడ్‌లో కోడలిపై ఆ అత్త చూపిస్తున్న ప్రేమను పక్కన పెట్టి, మత ప్రస్తావన తీసుకురావడమే మన భావదారిద్ర్యాన్ని వెల్లడిస్తోంది. అంతేకాదు ఇటీవల మత, కులాంతర వివాహాల వల్ల సమాజంలో జరుగుతున్న దాడులు కూడా ‘ఇండియా లవ్ ప్రాజెక్ట్’ త్వరగా ప్రారంభించడానికి కారణమయ్యాయి. ‘ప్రేమ, మతాంతర వివాహాల పట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారం మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది. ప్రజలు తమ కథలను వినిపించడానికి ఇండియా లవ్ ప్రాజెక్టు ద్వారా మేము వేదికను ఇస్తున్నాం’ అని హలంకార్ అన్నారు. ద్వేష పూరిత కథనాలను ప్రేమపూరిత లవ్‌స్టోరీలతో సవాల్ చేయాలని ఇండియా లవ్ ప్రాజెక్టు చూస్తోంది.
ఆ పేజీలోకి వెళితే.. భారతదేశ ‘సర్వమత సమ్మేళనం’ కళ్లముందు సాక్షాత్కారిస్తుంది. ఓ బ్రాహ్మణ అమ్మాయి, మరో ముస్లిం కుర్రాడి ప్రేమ ప్రయాణం.. మణిరత్నం ముంబై సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. మరో క్రైస్తవ మతస్థురాలు, జైన్ కుటుంబీకుడి దాంపత్య జీవనం.. ఓ అద్భుత ప్రేమకావ్యానికి తక్కువేం కాదు. మరో జంట కథలో.. భర్త శాకాహారి అయితే, భార్య మాత్రం నాన్‌వెజ్ ఇష్టంగా తింటుంది. ఆ ఇద్దరి ప్రేమకు రూపంగా జన్మించిన గారాల పట్టి మాత్రం తల్లిదండ్రుల వెజ్, నాన్ వెజ్‌ల కలయికతో పెట్టే గోరుముద్దులను ఆనందంగా తింటోంది. మరో ఆదర్శ జంట ఆహారానికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా కుల, మతాలకు ఇవ్వమని ఖరాకండిగా చెప్పేసింది. ఓ యువ జంట ప్రేమకథ నుంచి తల్లిదండ్రుల ప్రేమకహానీలు, తాత, నాన్నమ్మల లవ్ స్టోరీలు, కొడుకు కోడళ్ల మధురిమలు ఇలా.. ఎన్నో ఎన్నెన్నో ‘ప్రేమకావ్యా’లు లవ్ ఇండియా ప్రాజెక్టులో భాగమయ్యాయి.
ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే అంచనాల ప్రకారం.. దేశంలో కేవలం 5 శాతం మాత్రమే కులమతాంతర వివాహాలు జరుగుతుండగా, అందులో మతాంతర వివాహాలు 2. 2 శాతం మాత్రమే. ఈ అంకెల ప్రకారం మనమే ఓ అంచనాకు రావచ్చు. కానీ మత, కులంతార వివాహాలనగానే ఆ వాస్తవాన్ని మనం అంగీకరించం. మన ఊరిలోనో, పట్టణంలోనో అలాంటి ఓ వివాహం జరగగానే, మన దేశ సంప్రదాయం నాశనమైపోతోందని, మన కట్టుబాట్లు మంటగలిసిపోయాయని నానా రచ్చ చేస్తాం. కానీ ఇద్దరు మనుషులు ఒక్కటయ్యారని, మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ వర్ధిల్లుతోందని ఆలోచించం. సర్వమతాలకు ఇండియాలో స్థానం ఉండాలి కానీ, మన ఇంట్లో ఒకే కుల, మతాలు శ్వాసించాలి.
హృదయంలో ఉప్పొంగే మధురభావన ప్రేమ. ఆ హృదయానికి కంచెలు వేయడం మాని, స్వేచ్ఛగా స్పందించనివ్వండి. కుల మతాలతో గొంతులుకోయడం మాని ‘ప్రేమ’కు ఊపిరిపోయండి. లవ్ ఇండియాలోని స్వచ్ఛమైన ప్రేమకథల్లో మునిగి తేలితే, భారతీచ ఆత్మ ఏంటో మనకు తెలుస్తుంది.