తెరిచి ఉండేవి, మూతపడేవి ఇవే…

by Shamantha N |
తెరిచి ఉండేవి, మూతపడేవి ఇవే…
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలవుతుండడంతో కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు జన జీవనం స్థంభించనుంది. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ నిలిచిపోనున్నాయి. కరోనా మహమ్మరిని దరిచేరనీయకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల కదలికలు ఇళ్ళకే పరిమితం కానున్నాయి. ఈ నిర్ణయంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. అయితే ఈ 21 రోజుల పాటు ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి, ఏయే సంస్థలు మూతబడతాయి అనేదానిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ 21 రోజుల పాటు అవలంబించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని ఉల్లంఘించడం ద్వారా కేసులు నమోదు కావడంతో పాటు భారీ స్థాయిలో జరీమానాలు వసూలు చేయడం, జైలు శిక్షలు పడడం లాంటివన్నీ ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

మూతపడేవి :

  • అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, వాటికింద అనుబంధ విభాగాలు.
  • అన్ని రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు
  • రైళ్ళు, విమానాలు, బస్సులు, మెట్రోరైళ్ళు, సబర్బన్ రైళ్ళు, ఎంఎంటీఎస్ రైళ్ళు
  • అన్ని వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, పరిశ్రమలు, హోటళ్ళు, విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు, శిక్షణా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రార్థనాలయాలు, సినిమా థియేటర్లు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, పబ్లిక్ పార్కులు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, వినోద ప్రాంతాలు, స్పోర్ట్స్ క్లబ్బులు, జనసమ్మర్ధం స్వభావం కలిగిన రాజకీయ, సాంస్కృతిక కార్యకలాపాలు

తెరిచి ఉంచేవి:

  • రక్షణ రంగం, పారామిలిటరీ, పోలీసు, ఫైర్, జైళ్ళు, ట్రెజరీ, పెట్రోలు బంకులు, ఎల్పీజీ-సీఎన్జీ-పీఎన్జీ కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాతావరణ కేంద్రాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, ఏటీఎంలు, బీమా సంస్థలు, టెలీ కమ్యూనికేషన్ సంస్థలు, ఇంటర్నెట్ సేవా కేంద్రాలు, కేబుల్ సర్వీసులు, డిస్కంలు, పారిశుద్యం, త్రాగునీరు, మున్సిపాలిటీలో అత్యవసర సేవల విభాగాలు, ఆసుపత్రులు, లేబొరేటరీలు, కూరగాయల దుకాణాలు, నిత్యావర వస్తువుల కిరాణా దుకాణాలు, క్లినిక్‌లు, మెడికల్ షాపులు, రేషను దుకాణాలు, పాల సరఫరా కేంద్రాలు… ఇవన్నీ తెరిచే ఉంటాయి.
  • అత్యవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలు యధావిధిగా పనిచేస్తాయి.
    కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు, వేర్‌హౌజింగ్ సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, నిత్యావసరాలను సరఫరా చేసే రవాణా వాహనాలు, విదేశాల నుంచి వచ్చినవారు బస చేసిన హోటళ్ళు యధావిధిగా పనిచేస్తాయి. క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న స్టేడియంలు, హోటళ్ళు కూడా యధావిధిగా పనిచేస్తాయి.

పరిమితులతో పనిచేసేవి:

మృతుల అంతిమయాత్ర లేదా శ్మశానానికి వెళ్ళేటప్పుడు స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ విభాగాల అనుమతులతో పాటు ఇరవై మందికి మించకుండా జరగాలి. ఎక్కువ మంది గుమికూడే వివిధ మతాలకు చెందిన ప్రార్థనాలయాలు కూడా మూసివేసే ఉంచాలి. అత్యవసర సేవలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు మినహా మిగిలినవి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీస సిబ్బందితోనే పనిచేయించాలే ఆయా శాఖాధిపతులు ప్లాన్ చేయాలి. పరిశ్రమలు పనిచేస్తున్నప్పుడు అక్కడే ఎక్కువ మంది గుమికూడేలా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మంది పనిచేయాల్సి వస్తే విధిగా గరిష్ట స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి.

నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు దుకాణాల దగ్గరకు వచ్చినప్పుడు గుమికూడకుండా స్థానిక పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన శిక్షలు విధించాలి. ప్రభుత్వ సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి.

Tags: India, Lock Down, Home Ministry, Guidelines, permission,

Advertisement

Next Story

Most Viewed