అమెరికా తర్వాత మనమే..

by Shamantha N |
అమెరికా తర్వాత మనమే..
X

న్యూఢిల్లీ : దేశంలో తగ్గినట్టే తగ్గిన మాయదారి మహమ్మారి కరోనా మళ్లీ జనాలపై విరుచుకుపడుతున్నది. సెకండ్ వేవ్‌లో వీర విజృంభణ సాగిస్తున్నది. పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 24 గంటల్లోనే లక్షకు పైగా మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పట్నుంచీ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,03,558 మందికి కరోనా సోకింది. ఇది గతేడాది కొవిడ్ వ్యాప్తి పీక్ స్టేజ్‌లో ఉండగా.. అంటే 2020 సెప్టెంబర్ 17న నమోదైన కేసుల (97,894) కంటే తాజాగా రికార్డైనవే ఎక్కువ కావడం గమనార్హం. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,41,830 కి చేరింది. కొత్త కరోనా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకు 1,25,89,067 మందికి కరోనా సోకింది. ఇక సోమవారం 478 మరణాలు నమోదుకాగా.. మొత్తం మరణాలు 1,65,101 కి చేరాయి.

అప్పుడు 76 రోజులు.. ఇప్పుడు పాతిక రోజులే..

గతేడాది మే నుంచి అక్టోబర్ దాకా దేశంలో కొవిడ్ విలయతాండవం సృష్టించింది. ముఖ్యంగా సెప్టెంబర్ 10 తర్వాత రోజుకు 70 వేలకు మించి కేసులు వచ్చాయి. సెప్టెంబర్ 17న అత్యధికంగా 97,894 కేసులు నమోదయ్యాయి. ఇవే ఇప్పటిదాకా రికార్డు. అంతేగాక 20 వేల కేసుల నుంచి 97 వేలకు చేరుకోవడానికి 76 రోజులు పడితే.. సెకండ్ వేవ్‌లో మాత్రం పాతిక రోజుల్లోనే ఆ లాంఛనం (25 వేల కేసుల నుంచి లక్ష కేసులు) పూర్తైంది.

భారత్ లో ఈ ఏడాది మార్చి 11న 17,921 కేసులు రాగా.. తర్వాతి రోజు 22,854 కేసులు వచ్చాయి. ఇక సోమవారం (ఏప్రిల్ 5న) నాడు అవి లక్ష దాటాయి. కాగా, తొలిదశలో పీక్ స్టేజ్‌కు వెళ్లిన కరోనా కేసులు డిసెంబర్ 13 నుంచి 30 వేల మార్కు కంటే తక్కువే నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న 8,635 కేసులు వచ్చాయి. అప్పట్నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి మహారాష్ట్రలో సెకండ్ వేవ్ విజృంభణతో కేసుల సంఖ్య రోజుకు సగటున 7 వేలకు తగ్గకుండా పెరుగుతున్నది. రోజూవారీ కరోనా కేసులలో లక్ష కేసులు దాటిన దేశంగా అమెరికా తర్వాత భారత్ నిలిచింది. అమెరికాలో ఈ ఏడాది జనవరి 3న అత్యధికంగా 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, భారత్ తప్ప ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక్కరోజులో లక్ష కేసులు నమోదు కాలేదు.

మళ్లీ సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈనెల 8 న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌-19 కట్డడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తున్నది.

ఢిల్లీలో 24/7 టీకా..

ఢిల్లీ ఆరోగ్య శాఖ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు టీకా కేంద్రాల (ప్రభుత్వ) ను రోజంతా నిర్వహించనుంది. నేటి (మంగళవారం) నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలోని మూడింట ఒక వంతు టీకా కేంద్రాలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 వరకు పనిచేయనున్నాయి

Advertisement

Next Story

Most Viewed