త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ సాంకేతికత.. కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-12-05 07:27:46.0  )
amithsha
X

జైపూర్: దేశ సరిహద్దుల్లో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును అడ్డుకునేందుకు స్వదేశీ సాంకేతికతను భారత్ అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇది త్వరలో భద్రతా దళాలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.

రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ 57వ రైజింగ్ డే కార్యక్రమంలో సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘సరిహద్దు భద్రతకు ప్రపంచంలోనే ఉత్తమ సాంకేతికను మీకు అందిస్తాం. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సరిహద్దు దళాలకు డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోనేందుకు ఎన్ఎస్‌జీ, డీఆర్‌డీవో సమిష్టిగా యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థకు పనిచేస్తున్నాయి. నాకు మన శాస్త్రవేత్తలపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే దేశంలో స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని అన్నారు.

ఏ దేశమైనా భద్రత పరంగా పటిష్టంగా ఉంటేనే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. సరిహద్దు బలగాలు ఈ దేశాన్ని రక్షించడం పట్ల జాతి గర్విస్తుందన్నారు. సరిహద్దు దళాలు కేవలం దేశ రక్షణ మాత్రమే చేయట్లేదని, ప్రపంచంలోని ఇతర దేశాలకు వాణిజ్య అవకాశాలను స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. ఉత్తమమైన మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వ హయాంలో దాదాపు రెట్టింపు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు మద్దతుగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూడాలని అన్నారు.

Advertisement

Next Story