చైనా కంపెనీల ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు!

by Harish |
Oppo
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంపెనీలైన ఒప్పో, షావోమీ సంస్థల కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు కంపెనీలపై ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ల కాంట్రాక్ట్ తయారీ కంపెనీలైన రైజింగ్ స్టార్ ఇండియా, దఖ్సిణ భారత్‌లోని ఫ్యాక్టరీ డిక్సన్ యూనిట్లపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఒప్పో, వన్‌ప్లస్, షావోమీ కంపెనీలకు చెందిన పలు కార్యాలయాల్లో ఆయా కంపెనీలు ఆదాయంలో అవకతవకలు, పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా సోదాలు చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలకు చెందిన తయారీ ప్లాంట్ తో పాటు కార్పొరేట్ ఆఫీస్ లో, సరఫరాకు వినియోగించే గోడౌన్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘనకు సంబంధించి కారణాలతో ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.

దీనిపై స్పందించిన షావోమీ ప్రతినిధి.. తాము భారత చట్టాలకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో పెట్టుబడుల భాగస్వామిగా అధికారులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా, చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ గతంలోనూ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో చైనా టెలికాం పరికరాల తయారీ సంస్థ జెడ్‌టీఈ ఆఫీసులపై ఐటీ శాఖ దాడి చేసింది. ఆ సమయంలో పన్ను ఎగవేతకు సంబంధించిన నిధులు ఉల్లంఘన జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed