అవయవదానానికి సిద్ధమైన 400 మంది కేరళియన్స్

by Shyam |   ( Updated:2021-08-19 05:32:56.0  )
organ donation
X

దిశ, ఫీచర్స్: దానాల్లో కెల్ల గొప్పదానం ఏదంటే.. కొందరు అన్నదానం అంటే, మరికొందరు విద్యాదానమని చెబుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం అవయవ దానమే అన్నింటికన్నా గొప్పదిగా కీర్తించబడుతోంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టగలిగే శక్తి దానికే ఉంది. అందుకే ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ఫలితాలు ఆశించిన మేర ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా కేరళ, అందూర్ తాలూకాలోని తెంగమం గ్రామంలో 400 మంది ప్రజలు ఆర్గాన్ డొనేషన్‌‌కు అంగీకరించి ఆదర్శంగా నిలిచారు.

జిల్లా వైద్యాధికారి, నెహ్రూ యువకేంద్ర(NYK), పట్టణంతిట్ట సహకారంతో తెంగమం గ్రామంలోని 55 మంది యూత్ సభ్యులు స్థానికంగా ఆర్గాన్ డోనార్స్ క్యాంపెయిన్ చేపట్టారు. గ్రామంలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న ‘ఫ్రెండ్స్ సంస్కారిక వేది’ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా.. ఆరు రోజుల్లో 400 మంది గ్రామస్తులు అవయవదానానికి ఒప్పుకొన్నారు. 500 కుటుంబాలున్న గ్రామంలో 1500 జనాభా కలదు. కాగా ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్‌కు ఊహించని స్పందన లభించిందని స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ అను తెంగమం తెలిపాడు. నిజానికి తమ గ్రామస్తులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి అంతగా తెలియదని, కానీ ప్రస్తుతం మా ప్రయత్నాలు ఫలించాయని, చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం చేసేందుకు 400 మంది ఇష్టపూర్వకంగా ముందుకు రావడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంటింటి ప్రచారం ద్వారా అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలు, మూఢనమ్మకాలతో పాటు ఇతర సామాజిక నిషేధాలను తొలగించామని NYK జిల్లా యువ అధికారి సందీప్ కృష్ణన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed