గింత అన్యాయమా..!

by Shyam |
గింత అన్యాయమా..!
X

దిశ, మెదక్: ‘‘గింత అన్యాయమా.. అడిగేవారు లేరనే కదా.. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. మా లాంటి పేదలను ఆగమాగం చేస్తుండ్రు… అర్ధరాత్రి చుట్టు ముట్టి పెళ్లాం, పిల్లలను బయటకు గుంజి.. దౌర్జన్యంగా జేసీబీ‌లతో ఇండ్లు కూలగొట్టి రోడ్డు పాలుజెసిండ్రు’’ అంటూ నిర్వాసితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉసురు..ఉత్తగనే పోదు.. ఆ దేవుడు అన్ని జుస్తుండంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు జూసింది.

వివరాల్లోకెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టు‌లో భాగంగా నిర్మించిన అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం‌లో భూసేకరణ కోసం ప్రభుత్వం 2016లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సయంలో రైతులు, నిర్వాసితులను నయానో, భయానో ఒప్పించి ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. అనంతరం ప్రాజెక్టులో ముంపునకు గురువుతున్న కొచ్చగుట్టపల్లి గ్రామంలో ఇండ్లు, ఇంటి స్థలాలు సేకరించేందుకు 2017‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నచ్చక నిర్వాసితులు హై కోర్టును ఆశ్రయించారు. గ్రామంలో ఉన్న 128 కుటుంబాలకు‌గాను 64 కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి ఒప్పుకుని రంగనాయక సాగర్ మెట్టుబండల్ వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటున్నారు. మిగిలిన 44 కుటుంబాలలో 14 కుటుంబాలు స్థానికంగా ఉండటం లేదనే కారణంగా వారి విజ్ఞప్తి‌ని అధికారులు తిరస్కరించారు. మిగిలిన 30 కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నచ్చక హైకోర్టు‌ను ఆశ్రయించాయి.

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు..

నిర్వాసితులు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేననీ, బలవంతపు భూ సేకరణ చేయరాదని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలం చంద్లపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ నిర్మాణం పూర్తి కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు‌లో భాగమైన అనంతగిరి సాగర్ నిర్మాణం పూర్తై ప్రాజెక్టు‌లోకి నీళ్లు వదిలారు. అక్కడ నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నింపే క్రమంలో అనంతగిరి ప్రాజెక్టు‌లోకి 3.5 టీఎంసీల నీటిని వదిలారు. గత మూడ్రోజులుగా ప్రాజెక్టు‌లోకి పూర్తి స్థాయిలో నీళ్లు నిండాయి. ఈ సందర్భంలో ఆదివారం అర్ధరాత్రి కొచ్చగుట్టపల్లి గ్రామంలో నివాసమున్న 30 కుటంబాలను పోలీసు బలగాలతో అధికారులు గ్రామానికి చేరుకుని నిద్రిస్తున్న ప్రజలను ఇండ్ల నుంచి బయటకు నెట్టి ఇండ్లను జేసీబీ లతో కూల్చివేశారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడకూడా అర్ధరాత్రి రోడ్డు పాలుజెసిండ్రు. ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి మరీ ఇండ్లు కూల్చిండ్రు, ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకోకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎవరికీ చెప్పకుండా దౌర్జన్యం‌గా రోడ్డు పాలుజెసిండ్రు అంటూ నిర్వాసితులు ఇట్టడి మల్లారెడ్డి, మంగవ్వ‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ ఉండటంతో ఎవరూ రాకుండా నియంత్రణ చేసి, అడిగేవారు లేరని, కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కి అర్ధరాత్రి అధికారులు 4 వందల మంది పోలీసు‌లతో గ్రామాన్ని చుట్టు ముట్టి తమను గోదారి‌లో ముంచిండ్రు అంటూ నిర్వాసితుల చెమ్మగిల్లిన కళ్లతో దిక్కుతోచని స్థితిలో గోడు వెల్లబోస్తున్నారు.

నీటమునిగిన గ్రామం..

కాళేశ్వరం ప్రాజెక్టు‌లో భాగంగా అనంతగిరి రిజర్వాయర్ 3.5 టీఎంసీల సామర్థ్యం‌తో నిర్మించారు. అందులోని మరో ప్రాజెక్ట్ రంగనాయక సాగర్ 3 టీఎంసీల సామర్థ్యం‌తో నిర్మించారు. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తై ఇప్పటికే నీటిని వదిలారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం సైతం పూర్తి కావడంతో రంగనాయక సాగర్‌కు నీటిని నింపే దశలో అనంతగిరి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నీటి‌ని వదిలారు. దాంతో ఆదివారం అధికారులు హడావిడిగా నిర్వాసితులను గ్రామం నుంచి బలవంతంగా అర్ధరాత్రి బయటకు లాగి ఇండ్లు కూల్చివేశారు. అనంతరం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులోకి నీటిని వదిలారు. దీంతో నిర్వాసిత గ్రామమైన కొచ్చగుట్టపల్లి గ్రామం నీటి‌లో పూర్తిగా మునిగిపోయింది. నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా‌నే గ్రామం నీట మునగటంతో నిర్వాసితులు మునిగిన గ్రామాన్ని చూస్తూ బిక్కుబిక్కుమంటున్నారు. తమను నిండా ముంచేసిండ్రు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్లా బతికేది..

కోర్టు స్టే ఉన్నా కూల్చివేశారు. ఉన్న పది ఎకరాల పొలం ప్రాజెక్టులో పోయింది. వచ్చిన నష్టపరిహారం‌తో పెద్ద బిడ్డ పెళ్లి చేసినా.. చిన్న బిడ్డ పెళ్లికి ఏమీ లేదు.. భూమి పోవడంతో ఉన్న ఉపాధి పోయింది. ఏంజేసి బతకాలి.. భార్య పిల్లలను ఎట్లా పోషించేది. బతికేదెట్లా నష్టపరిహారం ఇవ్వకుండానే ఇల్లు రాత్రికి రాత్రే కూలగొట్టి రోడ్డున పడేసిండ్రు. సామాన్లు రోడ్డు మీదపడేసిండ్రు. కోర్టులో కేసు నడుస్తున్నా దౌర్జన్యం‌గా పోలీసులతో అధికారులు అర్ధరాత్రి ఇంట్లో నుంచి మమ్ములను బయటకు లాగి ఇళ్లు కూలగొట్టిండ్రు. మా బాధ ఎవరికి చెప్పుకునేది.

– ఇట్టడి మల్లారెడ్డి, నిర్వాసితుడు

నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..

నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా నిర్వాసితులను గ్రామం నుంచి ఖాళీ చేయించడం, ప్రాజెక్టులోకి నీళ్లు వదిలి గ్రామాన్ని ముంపునకు ఎలా గురిచేశారో పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు ఉండగా అర్ధాంతరంగా గ్రామం ఎలా ఖాళీ చేయిస్తారంటూ తీవ్రంగా కామెంట్ చేసింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణను ఈ నెల 24‌కు వాయిదా హైకోర్టు వాయిదా వేసింది. గతంలోనూ నిర్వాసితుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు‌పై పలుమార్లు కోర్టు హెచ్చరించింది. పలువురు అధికారులపై వేటు వేసింది. అయినా అధికారుల తీరులో మార్పురావడం లేదు. ఇది చూస్తుంటే ఈ అధికారులకు కోర్టు అంటే పట్టింపు లేదా అనే విమర్శలు వినపడుతున్నాయి.

Tags: 30 house demolition, officer, police, kocha guttapalli village, ananthagiri sagar project

Advertisement

Next Story

Most Viewed