ఆ పది రోజులు ‘ఆమె’కే..!

by Shyam |   ( Updated:2020-02-27 01:44:22.0  )
ఆ పది రోజులు ‘ఆమె’కే..!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఇప్పటివరకు ఎన్నడూ జరగని విధంగా ఈ ఏడాది మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న ఒక్క రోజు మాత్రమే కాకుండా పది రోజుల పాటు జరుపుకోవాలని కంకణం కట్టుకుంది. ఒక్కో రోజున ఒక్కో కార్యక్రమం చొప్పున మహిళల కోసం నిర్వహించబోతుండటం ఇదే మొదటిసారి కానుంది. దీనికి సంబంధించిన వివరాలను సమాచార ప్రసారాల శాఖకు చెందిన అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు.

‘ఈచ్ ఫర్ ఈక్వల్’ అనే ఇతివృత్తంతో ఈసారి మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, సమాన జీతం అనే కోణంలో విప్లవాలు వస్తున్న తరుణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ థీమ్‌ని ఎంచుకున్నారు. ఇప్పటికే కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అన్ని స్థానిక కార్యాలయాలకు సూచనలు అందినట్లు తెలుస్తోంది. మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 7 వరకు ఏడు రోజుల పాటు ఒక్కో అంశం గురించి ఒక్కో విధంగా సెలబ్రేట్ చేయనున్నారు.

విద్య, ఆరోగ్యం, పోషణ, మహిళా సాధికారత, నైపుణ్యాలు, ఆటల్లో భాగస్వామ్యం, ప్రత్యేక అవసరాలు, గ్రామీణ మహిళలు, వ్యవసాయం, పట్టణ ప్రాంత మహిళలు వంటి వివిధ అంశాల గురించి ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనున్నారు. సాధికారత అంశంలో భాగంగా పోలీసు, ఆర్మ్‌డ్ బలగాల్లో, మైనింగ్, ఇస్రో సంస్థల్లో పనిచేసిన మహిళలను సత్కరించనున్నారు. అలాగే గ్రామీణ మహిళలకు సంబంధించిన అంశంలో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, గర్భిణీలకు నగదు సాయం, కేన్సర్, వేసేక్టమీలకు ఆయుష్మాన్ భారత్‌లో లభిస్తున్న సేవల గురించి చర్చిస్తారు. అంతేకాకుండా పట్టణాల్లో మహిళ రక్షణ గురించి కూడా కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంబంధిత అంశాల ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖలు ఈ మహిళా దినోత్సవం జరుపుకునేలా కేంద్ర మహిళాశిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షల కేటాయించినట్లు సమాచారం. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం హైదరాబాద్, పుదుచ్చేరి, మైసూర్, మంగళగిరిల్లోని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 15 బృంద చర్చలు, వర్క్‌షాపులు, సెమినార్లు, టెడ్ టాక్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నివేదికను మార్చి 11న సమాచార శాఖకు తప్పనిసరిగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed