126 ఏళ్ల బాటా చరిత్రలో తొలి భారత సీఈవో.!

by Harish |
126 ఏళ్ల బాటా చరిత్రలో తొలి భారత సీఈవో.!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పాదరక్షల దిగ్గజ సంస్థ బాటా (Bata) గ్రూపునకు తొలిసారిగా ఓ భారతీయుడు బాధ్యతలను అందుకోనున్నాడు. ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా ఉన్న సందీప్ కటారియను రాబోయే ఐదేళ్ల పాటు బాటా గ్రూప్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా సంస్థ ఎంపిక చేసింది. దీంతో బాటా గ్రూప్ స్థాపించిన 126 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఓ భారతీయుడు ఈ బాధ్యతలు తీసుకోనుండటం విశేషం.

బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడిన సందీప్ కటారియా.. 126 ఏళ్ల చరిత్ర గలిగిన బాటా గ్రూప్ గ్లోబల్ సంస్థకు సీఈవోగా నన్ను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉంది. ఐదేళ్ల పాటు సంస్థతో ప్రయాణం గురించి తలుచుకుంటే సంతోషంగా ఉంది. బాటా అత్యుత్తమ నాణ్యత, సరసమైన పాదరక్షలను అందిస్తోంది. అందుకే ప్రపంచ ఖ్యాతిని కలిగి బ్రాండ్‌గా నిలిచింది. ప్రస్తుత ఏడాదిలో కరోనా మహమ్మారి, సంబంధిత సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తమ బ్రాండ్లపై ఉన్న నమ్మకం, ప్రజల అభిరుచి విశ్వాసంతో రానున్న సంవత్సరాల్లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను తీసుకొస్తామని చెప్పారు.

సందీప్ కటారియా నియామకంలో అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న భారత సీఈవోల సరసరన స్థానం సంపాదించుకున్నారు. బాటా ఇండియాకు సీఈవోగా అనుభగంతో బాటా గ్రూప్ గ్లోబల్ సీఈవోగా ఎదిగిన సందీప్ ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంతేకాకుండా 1993 పీజీడీబీఎం బ్యాచ్‌లో గోల్డ్‌మెడల్ కూడా అందుకున్నారు. దాదాపు 24 ఏళ్ల పాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్, కేఎఫ్‌సీ, వొడాఫోన్ సహా ఇతర కంపెనీల్లో సందీప్ కటారియా పనిచేశారు. 2017లో బాటా ఇండియాకు సీఈవోగా చేరిన తర్వాత సంస్థ అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించింది. నికర లాభాలు సైతం రెట్టింపు అయ్యాయి. సందీప్ సారథ్యంలో బాటా ఇండియా మెరుగైన ఫలితాలను దక్కించుకుందని కంపెనీ ఛైర్మన్ అశ్వని వెల్లడించారు.

Advertisement

Next Story