అధ్యక్ష స్థానంలో నా సోదరి కూర్చోవడం సంతోషంగా ఉంది: సీఎం జగన్

by srinivas |
Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు పలువురు జకియా ఖానమ్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. అనంతరం మండలిలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అధ్యక్ష స్థానంలో నా సోదరి జకియా ఖానమ్‌ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి గృహిణిగా చట్టసభలో అడుగుపెట్టడమే కాకుండా ఈ రోజు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూర్చోవడం మహిళలకు, మైనారిటీలకు శుభ సంకేతం. ఆడవాళ్లు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని మన ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లుగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు దేవుడు నాకు ఈ అదృష్టం కల్పించినందుకు సంతోషపడుతున్నాను. మనసారా హృదయపూర్వకంగా మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ మండలిలో తెలిపారు.

సీఎం జగన్‌కు రుణపడి ఉంటా

శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్స‌న్‌గా బాధ్యతలు చేపట్టిన జకియా ఖానమ్ మండలిలో మాట్లాడారు. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలిగా గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని జకియా అన్నారు. మహిళల సంక్షేమం కోసం అనే పథకాలు అమలు చేసి సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని తెలిపారు. అంతేకాకుండా జగన్ పాలనలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారు అని జకియా ఖానమ్ పేర్కొన్నారు. అంతకుముందు శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను ప్ర‌భుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు జకియా ఖానమ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed