- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మంలో భూ బాగోతం.. అనుమతులు లేకుండానే అమ్మకాలు..
దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అక్రమార్కులకు అధికారులు సహకరించడంతో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. అనుమతుల కోసం అప్లై చేసుకోవడం, అవి రాకముందే అన్నీ ఉన్నాయంటూ అమాయకులను మోసం చేయడం.. తెలిసీతెలియక కొన్నవారు ఇబ్బందుల్లో పడడం.. ఇదీ కొన్ని వెంచర్లలో జరుగుతున్న అక్రమ తంతు. ఇలాంటి మోసపూరిత వెంచర్లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నా రియల్ వ్యాపారులు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. వీరికి ముడుపులు పుచ్చుకుని అధికారులు సహకరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం నగరం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో భూములున్నవారు కొందరు రియల్టర్లకు అమ్ముకుంటుంటే.. మరికొందరేమో సొంతంగానే భూములను ప్లాట్లు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే విక్రయిస్తూ అడ్డదారిన రిజిస్ట్రేషన్లు సైతం చేయిస్తున్నారు. అక్రమ లే ఔట్లు.. అనుమతులు లేనే లేవు.. మరి రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయనుకుంటున్నారా..?
అక్రమ వెంచర్‌కు అండదండలు..
ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూ 311, 312 సర్వే నంబర్లలోని భూమి, వ్యవసాయభూమి. కానీ కొందరు వ్యక్తులు అది సాగుకు పనికిరాదంటూ అక్రమంగా వెంచర్లు వేశారు. ఈ వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేకుండానే ప్లాట్ల చేసి విక్రయాలు జరుపుతున్నారు. వీరికి రిజిస్ట్రేషన్ అధికారుల సపోర్టు ఉండడంతోనే అక్రమతంతు యథేచ్ఛగా సాగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూ సర్వేనంబర్ 311/అ2లో 2.1కుంటలు, 312/4 సర్వేనంబర్ లో2.3కుంటల భూమి వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేదంటూ కన్వర్షన్ కు మాత్రమే అనుమతుల కోసం అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు, లేఅవుట్ లేకుండానే వెంచర్ వేశారు.
రిజిస్ట్రేషన్లు ఎలా..?
సుమారు 4ఎకరాల సదరు భూమిని తండ్రి సహా ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నారు. అనంతరం అదే సర్వేనంబర్ లోని భూమిలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ భూమికి సంబంధించి స్థిరాస్థి విభజన డాక్యుమెంట్ మాత్రమే వీరి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అమాయకులకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ అంటగడుతున్నారు. అంతేకాదు.. గ్రీన్ బెల్ట్ స్థలం కానీ ఇతర ఏ నిబంధనలు కానీ పాటించకపోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా..
రియల్ వ్యాపారంలో ఇటీవల అక్రమాలు తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్రమ లేఔట్లు, వెంచర్లపై కొంత కాలంగా కొరడా ఝులుపిస్తూనే ఉంది. నిబంధనలు ఎప్పటికప్పుడు కఠిన తరం చేస్తూ వస్తోంది. అనుమతులు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాటికి రిజిస్ట్రేషన్ చేయరాదంటూ స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది. అయినా ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఖమ్మం-1 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మల్లెమడుగు వెంచర్లకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ల తంతులో భారీగానే ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.