రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు..

by Sridhar Babu |
రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు..
X

దిశ, కల్లూరు : ఎన్ఎస్‌పీ స్థలం ఆక్రమించేందుకు ఖమ్మం జిల్లా కల్లూరులో దళారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ స్థలం కనపడితే చాలు పాగా వేసే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది రూపాయల విలువ చేసే ఎన్ఎస్‌పీ స్థలాలు దళారుల కబ్జాలో ఉన్నాయి. అధికారులను మోసం చేస్తూ కబ్జాదారులు లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వం కాలువ నిర్మాణం కోసం పనులు చేపట్టిన సమయంలో.. ప్రభుత్వం రివార్డులు ఇచ్చి ప్రజల వద్ద నుండి భూములు కొనుగోలు చేసింది.

కాలువ నిర్మాణం డిజైన్ బట్టి సాగర్ ఎడమ కాలువ మధిర బ్రాంచ్ నందు జీరో నుండి ఐదు కిలోమీటర్ల వరకు ప్రభుత్వం ఎన్ఎస్‌పీ స్థలాలు ఏర్పాటు చేసింది. అధికారులు కాలువ నిర్మాణాన్ని 100 నుండి 275 అడుగుల వరకు ఏర్పాటు చేశారు. అయితే, కొందరు అక్రమార్కులు దళారుల అవతారమెత్తి స్థలాలను కబ్జా చేసి లక్షలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్ఎస్‌పీ కాలువ బ్రిడ్జీ సమీపంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న కారణంగా రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి కేవలం తూతుమంత్రంగా సర్వే నిర్వహించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టే స్థలం దగ్గర సర్వే నెంబర్ 56/2/p, 58/2/p లో ఇంకా మిగిలి ఉన్న సుమారు 32 గుంటల భూమికి సరిహద్దులు పెట్టకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సమగ్ర సర్వే నిర్వహించి అక్రమార్కుల చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయల స్థలం కబ్జాకోరల్లో నుండి విడిపించాలని కోరుతున్నారు. దీంతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ స్థలంలో మరికొంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం, పోలీస్ కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్‌పీ డీఈ రాజా రత్నాకర్ అన్నారు.

ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మధిర ఎన్‌ఎస్‌పీ కెనాల్ మీద 2 నుండి 2.5 ఎకరాల భూమిలో ఇళ్ల నిర్మాణం చేస్తుండగా ‘లస్కర్’ చూసి సమాచారం ఇచ్చారు. దీంతో తక్షణమే కట్టడాల నిర్మాణాలను నిలిపి వేసినట్టు తెలిపారు. కబ్జాదారులకు భూమిపైన ఉన్న అనుమతుల ఆధారాలు సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ స్థలాలపై అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. గత 20 ఏళ్ళ నుంచి ఎన్ఎస్‌పీ స్థలాలపై ఇండ్లు ఏర్పాటు చేసుకున్న సుమారు పది మందిని గుర్తించి నోటీసు ఇవ్వడం జరుగుతుందన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే నెంబర్ 56/2/p ,58/2/p లో ప్రభుత్వ స్థలం ఎంత ఉంది అన్న విషయంపై ఉన్నతాధికారుల అనుమతితో సర్వే చేసి గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed