శృతిమించిన టీఆర్ఎస్​ కార్పొరేటర్ల ఆగడాలు

by Anukaran |
శృతిమించిన టీఆర్ఎస్​ కార్పొరేటర్ల ఆగడాలు
X

దిశ, ఎల్బీనగర్ : సమస్యలు పరిష్కరిస్తారని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే దౌర్జన్యాలకు, దాడులకు, బెదిరింపులకు దిగడమే తమ బాధ్యత అన్నట్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్ల వ్యవహార శైలి కొనసాగింది. ఐదేళ్లుగా వారు ఆడిందే ఆటగా పా డిందే పాటగా హవా కొనసాగించారు. తిరిగి వీరినే గ్రేటర్ బరిలో టీఆర్ఎస్ నిలబెట్టడంతో ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారంలో భాగంగా తిరుగుతున్నపుడు ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్యంగా వ్యవహరించారని ఆయా కార్పొరేటర్ల తీరుపై ప్రశ్నిస్తున్నారు.

ప్రధానంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, మన్సురాబాద్, నాగోల్, హస్తినాపురం, చంపాపేట, కొత్తపేట డివిజన్లలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్పొరేటర్లపై అసంతృప్తి కనిపిస్తోంది. హయత్ నగర్, బీఎన్ రెడ్డినగర్, మన్సురాబాద్, హస్తినాపురం కార్పొరేటర్ల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ప్రచారంలో పాలుపంచుకుంటున్న అభ్యర్థులకు వివరిస్తున్నారు. నిన్నగాక మొన్న హయత్ నగర్ డివిజన్ లో తమ ప్లా టు ను చూపించాలని సాయం కోసం ఓ వ్యక్తి స్థానిక కార్పొరేటర్ ను ఆశ్రయిస్తే.. అదే అదునుగా భావించిన కార్పొరేటర్ అట్టి స్థలాన్ని సొంత తమ్ముడికి రిజిస్ట్రేషన్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా గత ఎన్నికల్లో డివిజన్ ఎన్నికల ఇన్ చార్జిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్లాటును సైతం కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా తమ పరిధిలో ఉన్న ప్లాట్లు, ఖాళీ స్థలాలు, భవనాలు ఏఒక్కటినీ వదిలిపెట్టకుండా తమ ఖాతాలో జమచేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పద్ధతిలో హస్తినాపురం, నాగోల్, మన్సురాబాద్ కార్పొరేటర్లు వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికల్లో ఏమీ తెలియని నంగనాచిలాగా ప్రజల వద్దకు పరుగులు పెట్టి ఓట్లు అడుక్కుంటున్నారు.

కొంగుచాటు రాజకీయాలు..

ఒకపుడు తానే ఎమ్మెల్యేననే స్థాయిలో అజమాయిషీ చేసిన నాయకుడు, నేడు కొంగుచాటు రాజకీయాలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఆకాంక్ష నెరవేరకపోవడంతో ఇంటికే పరిమితమై వివాద భూస్థలాల సెటిల్ మెంట్లకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. అంతేగాకుండా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాటి నుంచి ఆ నాయకుడు లోపాయికారి సంబంధాలతో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేపై కోపం ఉన్నప్పటికీ పార్టీ మారేందుకు సహాసం చేయడం లేదు.

ఎందుకంటే అధికార పార్టీని వీడితే తాను చేసే ఆగడాలు సాగబోవని గమనించి కొనసాగుతున్నారు. అయితే తాను చేసే పనులల్లో ఎమ్మెల్యే లేకుండా అధిష్ఠానం నుంచి ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తుల కుటుంబాలను బరిలోకి దించి కొంగు చాటు రాజకీయాలు యోచిస్తున్నారు. బీఎన్ రెడ్డినగర్ లో అదే రాజకీయం సాగుతున్నట్లు ప్రజలల్లో చర్చ సాగు తోంది. అయితే భర్త చేసే వ్యవహారాలతో కార్పొరేటర్ బరిలో నిలిచిన అభ్యర్థి పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ అభ్యర్థికి విజయం అంత సులభమేమీ కాదన్న చర్చ సాగుతోంది.

Advertisement

Next Story