జూలైలో జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు

by Shamantha N |   ( Updated:2020-05-05 02:40:08.0  )
జూలైలో జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు
X

న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు లాక్‌డౌన్ కారణంగా రద్దు కావడంతో జూలై చివరి వారంలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ పరీక్షలు జూలై 18 నుంచి 23 తేదీల మధ్య జరుగుతాయని, నీట్ పరీక్షలు మాత్రం జూలై 26వ తేదీన జరుగుతాయని ఢిల్లీలో ఆయన తెలిపారు. సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్నది త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీని కూడా త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. బహుశా ఆగస్టులో ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పుడు జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్ష తేదీలను ఖరారు చేసినందున విద్యార్థులు ప్రిపేర్ కావచ్చని తెలిపారు. ఇప్పటికీ నీట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ జేఈఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, నీట్ పరీక్షకు మాత్రం 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై చివరికల్లా డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు తయారుచేసుకోవాల్సిందిగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో జేఈఈ, నీట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర హెచ్ఆర్‌డి మంత్రి అభిప్రాయపడ్డారు.

Tags: IIT, JEE, examination, HRD ministry, ramesh pokhriyal, corona, lockdown

Advertisement

Next Story

Most Viewed