వాస్తు ప్రకారం టీవీ ఎలా పెట్టుకోవాలంటే?

by Sujitha Rachapalli |
వాస్తు ప్రకారం టీవీ ఎలా పెట్టుకోవాలంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘జేఎల్ బయార్డ్’ అనే మహానుభావుడు ఏ ఉద్దేశంతో టీవీని కనిపెట్టాడో కానీ, అది అందరి జీవితాల్లోనూ మార్పు తీసుకొచ్చింది. సాధారణంగా కాలక్షేపం కోసం టీవీ చూస్తుంటాం. కానీ టీవీలో వచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ అన్నీ కూడా ప్రస్తుతం ‘న్యూసెన్స్’గా మారిపోయాయి. కుటుంబాల్లో గొడవలకు, అశాంతికి కారణమవుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఇక న్యూస్ విషయానికొస్తే.. అనవసర రాద్ధాంతాలు క్రియేట్ చేస్తూ, టీఆర్పీల కోసం అవసరం లేని నానా చెత్తను టెలీకాస్ట్ చేస్తూ న్యూస్ తెలుసుకోవాలనుకునే వారికి కూడా విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కాశ్వన్.. టీవీని వాస్తు శాస్త్ర ప్రకారం ఎలా పెట్టుకోవాలో తెలుపుతూ వ్యంగ్యంగా ఓ పోస్ట్‌ పెట్టాడు.

వాస్తు శాస్త్రాన్ని చాలా మంది విశ్వసిస్తారు. ఈశాన్యంలో బరువు ఎక్కువగా పెట్టొద్దు, ఆగ్నేయంలో ఖాళీ ఉంచాలి, గేటు ఎదురుగా బోరు వేయకూడదు, వంటగది ఆ పక్క ఉండాలి, బెడ్‌రూమ్ ఈ పక్క ఉండాలి, బీరువా అటువైపుగా తిప్పి పెట్టాలి.. ఇలా ప్రతీది వాస్తుతో ముడిపెడతారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల ప్లేసింగ్ వరకు ప్రతి ఒక్కటీ వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు. అందుకే.. ఐఎఫ్ఎస్ ప్రవీణ్ తాను చెప్పాలనుకున్న అంశానికి వాస్తును జోడిస్తూ.. ‘వాస్తు ప్రకారం టీవీని ఈ వైపుకు పెడితే ఇల్లే కాదు మనసు, జీవితానికి సుఖశాంతులు లభిస్తాయని మా పెద్దన్నయ్య చెప్పాడు’ అంటూ.. ఆయన టీవీని వెనుక వైపుకు తిప్పి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘మా అమ్మనాన్న ఏం చెప్పారంటే… ఇంట్లో అసలు టీవీయే లేకపోతే ఇంకా బాగుంటుంది, మరింత సుఖంగా ఉంటుంది, ఇది నిజమే.. వాస్తు ప్రకారం నేను దీన్ని ప్రాక్టికల్‌గా పరీక్షించి చూశాను.. తప్పకుండా ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి, టీవీతో పాటు మొబైల్‌కు కూడా ఇది వర్తిస్తుంది. మొదట్లో కాస్త.. కష్టంగా ఉంటుంది కానీ, ఆ తర్వాత ఒత్తిడి దూరమవుతుంది. ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

టీవీ, మొబైల్.. ఇంకేదైనా సరే కాలక్షేపాన్ని, జ్ఞానాన్ని అందించాలి కానీ.. అనవసర తలనొప్పులు తెచ్చిపెట్టొద్దు.

Advertisement

Next Story

Most Viewed