ధర ఎక్కువైనా.. గ్రీన్ క్రాకర్స్ కాల్చేద్దాం..

by Shyam |   ( Updated:2021-10-28 01:39:17.0  )
Green Crackers
X

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి వచ్చిందంటే చాలు. రోడ్లన్నీ పటాకుల పేపర్లతో నింపేయాలి అనుకుంటారు. ఏడాదికోసారి వచ్చే పండుగ కావడంతో ఎన్ని వేలు ఖర్చు అయినా సరే, కాలనీ అంతా మన గురించే మాట్లాడుకోవాలి అనుకుంటారు. ఈ సందర్భంగా కొన్ని అధికంగా సౌండ్స్ వచ్చేవి, కొన్ని విపరీతంగా పొగలు వచ్చేవి కాలుస్తుంటారు.

ఇలా విపరీతంగా పటాకులు కాల్చడంతో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయి పర్యావరణాన్ని మరింత దెబ్బతీస్తాయి. ఫ్యాక్టరీలు, వాహనాలు ద్వారా వెలువడే కలుషిత వాయువులతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న క్రమంలో దీపావళి పేరుతో భారీగా పటాకులు కాల్చడం ఎంతవరకు సమంజసం అంటున్నారు పర్యావరణ ప్రేమికులు.

గ్రీన్ కాకర్స్ వైపు మొగ్గుచూపాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ గత రెండేళ్లుగా చెబుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీనితోపాటు పటాకులు అమ్మేవారు కూడా గ్రీన్ కాకర్స్ అమ్మకపోవడంతో మార్పు కష్టతరమవుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది నుంచి గ్రీన్ క్రాకర్స్‌ను భారీగా అందుబాటులో ఉంచనున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. అయితే, గ్రీన్ క్రాకర్స్‌కు కొంచెం ధర ఎక్కువ అని చెబుతున్నారు. కాస్లీ కాబట్టి చాలా మంది కొనేందుకు ముందుకురావడం లేదని పేర్కొంటున్నారు. అయితే, క్రాకర్స్‌ను బ్యాన్ చేశాక బాధపడేకంటే.. ఎక్కువ రేటు అయినా సరే కొన్నైనా కొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, సీడ్ పటాకులు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. రాడిష్‌ రాకెట్‌.. మెంతీ బాంబ్‌.. మేరీగోల్డ్‌ చక్రీ.. బేసిల్‌ బాంబ్‌.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కల పేర్లతో మార్కెట్‌లోకి వచ్చేశాయి. వీటిని కాల్చితే విత్తనాలు బయటపడి మొక్కలు పెరుగుతాయని తయారీదారులు చెబుతున్నారు.

గ్రీన్ క్రాకర్స్ అంటే?

సాధారణంగా క్రాకర్స్‌లో పొటాషియమ్‌ నైట్రేట్‌, సల్ఫర్‌ వంటివి అధికంగా వినియోగిస్తుంటారు. ఇవి ఎక్కువ మొత్తంలో కాలుష్య రేణువులు ఉత్పత్తి అవుతాయి. అదే గ్రీన్ క్రాకర్స్‌లో అతి తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే మెగ్నీషియంతో పాటు తక్కువ పరిమాణం పొటాషియమ్‌ నైట్రేట్‌, సల్ఫర్‌‌లను కూడా కలుపుతారు. ఈ గ్రీన్ క్రాకర్స్ పేలినప్పుడు నీటి పరమాణువులను ఉత్పత్తి చేయడంతో ఇవి గాల్లోని ధూళి కణాలను గ్రహిస్తాయి. తద్వారా కాలుష్యాన్ని అధికమొత్తంలో నివారించవచ్చు. ఈ కారణంగా పటాకులను కాల్చిన ఫీలింగ్‌తో పాటు పర్యావరణాన్ని రక్షించిన వారవుతారు.

Advertisement

Next Story