ఆ బ్యాంక్ ఏటీఎం ఛార్జీల్లో మార్పులు.. ఇకనుంచి బాదుడే

by Harish |   ( Updated:2021-07-28 07:01:56.0  )
ఆ బ్యాంక్ ఏటీఎం ఛార్జీల్లో మార్పులు.. ఇకనుంచి బాదుడే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ ఆగష్టు 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా నగదు విత్‌డ్రా, చెక్‌బుక్ లీవ్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించిన సేవలపై ఛార్జీలలో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా 6 మెట్రో నగరాల్లో మొదటగా చేసే మూడు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం నుంచి నెలలో మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను నిర్వహించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

మెట్రోల్ నగరాల్లో కాకుండా అన్ని ప్రదేశాల్లో మొదటి ఐదు లావాదేవీలు ఉచితంగా చేయవచ్చు. అదనంగా చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 ఛార్జీలను వసూలు చేయనుంది. సొంత బ్రాంచీలో జరిపే నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ. లక్ష ఉచితంగా తీసుకోవచ్చు. ఆపైన ప్రతి రూ. వెయ్యికి రూ. 5 ఛార్జీ ఉంటుంది. వేరే బ్రాంచీలో రోజుకు రూ. 25 వేల వరకు నగదు లావాదేవీ ఉచితం. ఆపైన రూ. వెయ్యికి రూ. 5 ఛార్జీ ఉంటుంది. థర్డ్ పార్టీ లావాదేవీ రోజుకు రూ. 25 వేలుగా బ్యాంకు నిర్ణయించింది. ఆపైన రూ. 25 వేల వరకు రూ. 150 ఛార్జీ ఉంటుందని, అది దాటితే అనుమతి నిరాకరించబడుతుందని బ్యాంకు వివరించింది. అలాగే, ఒక ఏడాదిలో తీసుకునే 25 చెక్‌లున్న చెక్‌బుక్‌పై ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత 10 చెక్‌లున్న చెక్‌బుక్‌పై రూ. 20 ఛార్జీ అమలు చేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed