UAE లో టీ20 వరల్డ్ కప్.. ఆతిథ్యం బీసీసీఐ.. ఐసీసీ క్లారిటీ

by Shyam |
T20-WC
X

దిశ, స్పోర్ట్స్: పురుషుల టీ20 వరల్డ్ కప్ విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. వేదికలు, తేదీలతో పాటు ఆతిథ్యపు హక్కులపై కూడా ఐసీసీ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఐసీసీ, ఈసీబీ, ఓసిఏలతో సంప్రదింపులు జరిపిన బీసీసీఐ అన్ని అడ్డంకులు తొలగించేసింది. ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ముగిసిన వారం రోజులకే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. అయితే పిచ్‌లు పాడవుతాయనే విమర్శలకు కూడా బీసీసీఐ సమాధానం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఒమన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుండగా.. సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించనున్నారు. వరల్డ్ కప్‌కు సంబంధించిన పూర్తి ఆతిథ్యపు హక్కులు బీసీసీఐ అట్టిపెట్టుకున్నది. ఐపీఎల్ తరహాలో కేవలం స్టేడియం అద్దెలు, లాజిస్టిక్ ఖర్చులను ఇరు బోర్డులకు బీసీసీఐ అదించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

యూఏఈలో చర్చలు..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అక్కడ ఈసీబీ పెద్దలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అదే సమయంలో ఒమన్ క్రికెట్ బోర్డుతో కూడా చర్చించారు. అందరితో కూలంకషంగా చర్చించిన తర్వాత ఐపీఎల్ మలి దశ, టీ20 వరల్డ్ కప్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యూహాన్ని సిద్దం చేసింది. జూన్ 28నే బీసీసీఐ పూర్తి వివరాలను ఐసీసీకి అందించినట్లు తెలుస్తున్నది. దీంతో వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ కూడా స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 17న ఒమన్‌లో ప్రిలిమినరీ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయని.. సూపర్ 12 మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగనున్నది. పూర్తి బయోబబుల్ వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఆటగాళ్ల ఆరోగ్యాలకు పూర్తి భరోసా ఉంటుందని ఆయన చెప్పారు. ఐపీఎల్ 2021 ఫైనల్ ముగిసిన పది రోజుల తర్వాతే యూఏఈలో సెకెండ్ లెగ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఆ లోగా అన్ని స్టేడియంలలోని పిచ్‌లను తిరిగి సిద్దం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

అంతా బీసీసీఐ చేతిలోనే..

యూఏఈ, ఒమన్ వేదికల్లో నిర్వహించే టీ20 వరల్డ్‌ కప్‌కు సంబంధించి అన్ని ఆతిథ్యపు హక్కులు బీసీసీఐ చేతిలోనే ఉంటాయి. ఇండియాలో కరోనా సమస్యకు తోడు కేంద్ర ప్రభుత్వంతో ట్యాక్సు మినహాయింపు సంబంధించిన చర్చల్లో పురోగతి లేకుండా పోయింది. ఐసీసీ ఈవెంట్లకు గతంలో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వకపోవడంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లుతున్నది. ట్యాక్స్ మినహాయించకపోతే బీసీసీఐ ఆదాయం నుంచే దానికి కోత పెడతామని ఐసీసీ కూడా గతంలో చెప్పింది. దీంతో యూఏఈలో ఈ సారి టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా వాటికి చెక్ పెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. యూఏఈలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా అదనంగా ట్యాక్స్‌లు చెల్లించే అవకాశం ఉండదు. ఇప్పటికే దీనికి సంబంధించి యూఏఈ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా జరిగాయి. అందుకే బీసీసీఐ అన్ని రకాలుగా ఆలోచించి యూఏఈ వేదికను ఖరారు చేసింది. ఐసీసీ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంలో ఆతిథ్యపు బీసీసీఐకు ఎక్కువ వాటా వెళ్లనున్నది. ఒమన్, యూఏఈ క్రికెట్ బోర్డులకు కేవలం నామ మాత్రపు ఫీజలు చెల్లించనున్నట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed