ముళ్లబాటపై గులాబీలు.. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నాయకులు

by Aamani |
ముళ్లబాటపై గులాబీలు.. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నాయకులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో నిరాశ, నిస్పృహలతో ఉన్న పార్టీ శ్రేణులకు ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఆ పార్టీ శ్రేణులను మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ముందుండి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో అధికార పార్టీ వేస్తున్న పాచికలలో బీఆర్ఎస్ నేతలు చిక్కుకుంటున్నారా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే అంశాలపై స్పష్టత లేక దిగువ శ్రేణులు, దిగులు చెందాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

వరుస ఘటనలు.. రాష్ట్రవ్యాప్త చర్చలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు రాష్ట్రవ్యాప్త రాజకీయాలలో చర్చలకు తెర లేపుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు అందుకున్నారని, ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ చేపట్టిన అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడులు బీఆర్ఎస్ నేతల కుట్రలతోనే జరిగాయని పోలీసులు నిర్ధారణకు వచ్చి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంఘటన కొడంగల్ నియోజకవర్గంలోనే కాకుండా.. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీనికి తోడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ సంఘటనలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తున్నాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు క్రిస్టియన్ పల్లి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 523లో అక్రమంగా ప్లాట్ల విక్రయాలు జరిగాయని, అందులో మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ముద్దాయిగా ఉన్నారంటూ పోలీసుల కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేపింది. దీనికితోడు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సైతం రాష్ట్ర బీఆర్ఎస్ నాయకత్వం పై చేసిన విమర్శలు సైతం గులాబీ శ్రేణుల్లో ఒకింత గుబులు రేపుతోంది.

ఉక్కిరిబిక్కిరి చేసేలా అధికార పార్టీ వ్యూహం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పలు కారణాలతో ఉక్కిరిబిక్కిరి చేసేలా అధికార పార్టీ కీలక నేతలు విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పులు, తదితర అంశాలపై దశలవారీగా వివరాలు సేకరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకునేలా సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Next Story