విమానయాన రంగంలో 29 లక్షల ఉద్యోగాలకు డేంజర్ బెల్!

by Harish |
విమానయాన రంగంలో 29 లక్షల ఉద్యోగాలకు డేంజర్ బెల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు ఇప్పటికే సంక్షోభంలో పడ్డ భారత విమానయాన రంగానికి మరిన్ని కష్టాలు తప్పవని తెలుస్తోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగాను అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్న క్లిష్ట సమయంలో విమానయాన రంగంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానాలన్నీ పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. అన్ని రకాలుగా ఆదాయం క్షీణించింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన సంస్థలు, కొంతమందిని ఉద్యోగం నుంచి తొలిగించాయి కూడా. ఇటీవల అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) విమానయాన రంగంలో 29,32,900 ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్టు నివేదిక విడుదల చేసింది.

ఇండియాలో కరోనా వ్యాప్తి విమానయాన రంగంలోని ఉద్యోగాలపై ప్రభావం చూపనున్నట్టు ఐఏటీఏ పేర్కొంది. పైగా, 2019 ఏడాది కంటే 2020లో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా తగ్గే అవకాశమున్నట్టు అంచనాలున్నట్లు తెలిపింది. సుమారు 47 శాతం క్షీణతతో ప్రయాణీకుల క్షీణత ఉండనున్నట్టు అభిప్రాయపడింది. అంతేకాకుండ, ప్రయాణాల డిమాండ్ లేని కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రూ. 85,000 కోట్ల భారీ ఆదాయం తగ్గుతుందని ఐఏటీఏ స్పష్టం చేసింది. విమానయాన సంస్థలకు భారాన్ని తగ్గిస్తూ నగదు లభ్యతపై ఆయా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోతే గ్లోబల్ ఏవియేషన్ రంగానికి తీవ్రమైన నష్టం తప్పదని హెచ్చరించింది.

పరిస్థితి క్షీణిస్తున్నందున ఇండియా, జపాన్, మలేషియ, ఇండోనేషియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఐఏటీఏ భావించింది. చరిత్రలో లేంత నష్టాన్ని కలిగిస్తున్న చొవిడ్-19 కారణంగా విమానయాన రంగం మనుగడే ప్రమాదకర స్థాయిలో ఉందని అభిప్రాయపడింది.

Tags: Coronavirus Pandemic, Airline Jobs, Aviation Jobs, Lockdown

Advertisement

Next Story

Most Viewed