వైరల్‌గా కంగనా డ్రగ్స్ అడిక్షన్ వీడియో

by Shyam |
వైరల్‌గా కంగనా డ్రగ్స్ అడిక్షన్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ :

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనాకు, మహా ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. కాగా, శివసేన బెదిరింపులపై తనకు థ్రెట్ ఉందని కంగనా కేంద్రానికి మొరపెట్టుకోవడంతో ఆమెకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. ఈ క్రమంలో గతంలో కంగనాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు మహా ప్రభుత్వం సిద్ధమయ్యింది. అయితే, గతంలో కంగనా రనౌత్ ‘తానూ డ్రగ్ అడిక్ట్‌నే’ అని చెప్పిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కంగనా ఇటీవలే తన లైఫ్‌లో స్ట్రగుల్ మూమెంట్స్‌ను, పైకి ఎదిగిన తీరును తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ‘నేను 16 ఏళ్ళ వయస్సులో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చాను. ఎన్నో కష్టాలు పడి ఓ ఫిల్మ్‌ స్టార్‌ను అయ్యాను. అంతేకాదు ఆ టైమ్‌లోనే డ్రగ్స్‌కు అలవాటుపడ్డాను. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. ఎంతోమంది చేతిలో మోసపోయాను. యంగ్ ఏజ్‌లో ఇదంతా జరిగింది’ అని చెప్పుకొచ్చింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాకు డ్రగ్స్‌తో లింకులు ఉన్నాయని, దర్యాప్తు చేయాలని చూస్తుండగా, ఆమె ఈ వీడియోలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ యాక్టర్ అధ్యాయన్ సుమన్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కంగనా రనౌత్ కొకైన్ వాడతారని, తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని కోరారని’ సంచలన ఆరోపణలు చేశారు. దీని ఆధారంగా కంగనాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేయగా.. దీనిపై కంగనా స్పందిస్తూ 99 శాతం మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటారని, అయితే.. డ్రగ్స్ తీసుకునే వారితో తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఒకవేళ తనకు డ్రగ్స్ మాఫియాతో కనెక్షన్స్ ఉన్నాయని నిరూపిస్తే.. ముంబై వదిలి వెల్లిపోతానంటూ ఓ ట్వీట్ చేసింది.

ఇలా తనపై అన్ని వైపుల నుంచి డ్రగ్స్ ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.

Advertisement

Next Story