వారి త్యాగాలు దేశం ఎన్నటికీ మరువదు : ప్రధాని

by Shamantha N |
వారి త్యాగాలు దేశం ఎన్నటికీ మరువదు : ప్రధాని
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఎమర్జెన్సీపై స్పందించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 45ఏళ్లు గడిచాయని ట్వీట్ చేశారు. ఆ గడ్డుకాలంలో ప్రజాస్వామ్యానికి పాటుపడిన, పోరాడినవారికి సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని వ్యాఖ్యానించారు. గతేడాది మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎమర్జెన్సీ కాలం గురించి ఆయన మాట్లాడిన క్లిప్‌ను ట్వీట్‌కు జతచేశారు. 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ సర్కారు ఎమర్జెన్సీ విధించింది. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు చేసిన తర్వాత మోడీ ఈ ట్వీట్ పోస్టు చేశారు.

రాత్రికి రాత్రే దేశాన్ని బందీఖానా చేశారు: అమిత్ షా

ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. 45ఏళ్ల క్రితం ఈ రోజు ఒక కుటుంబ అధికార దాహంతో ఎమర్జెన్సీ విధించిందని తెలిపారు. రాత్రికి రాత్రే దేశాన్ని బందీఖానా చేశారని పేర్కొన్నారు. పాత్రికేయం, న్యాయస్థానాలు, భావప్రకటన స్వేచ్ఛ.. అన్నింటినీ కాలారాసిందని విమర్శించారు. పేదలు, అణగారిన వర్గాలపై నేరాలు జరిగాయని వివరించారు. ఒక్క కుటుంబం ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలుగా, దేశ ప్రయోజనాలుగా చెలామణి చేశారని ఆరోపించారు. ఇంతటి దౌర్భాగ్యా పరిస్థితులు ఇప్పటికీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాదు, కాంగ్రెస్‌ను ఆత్మవిమర్శ చేసుకోవాలనీ సూచించారు. ఎమర్జెన్సీ మైండ్‌సెట్ ఎందుకు ఇంకా కొనసాగుతున్నదని, ‘ఒక’ వంశానికి చెందినవారు మినహా మిగతావారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని, మిగతా కాంగ్రెస్ నాయకులు ఎందుకు క్షోభకు గురవుతున్నారో ఆలోచించుకోవాలని తెలిపారు. లేదంటే ఆ పార్టీ ప్రజలకు దూరమవుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed