ఆ సేవల్లో జీహెచ్ఎంసీ వెరీ పూర్

by Anukaran |
ఆ సేవల్లో జీహెచ్ఎంసీ వెరీ పూర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మౌలిక వసతుల కల్పనలో ముందుంది. ప్రజాసేవలు, విద్య, వైద్యం, ఇతర అంశాల్లోనూ ఇంతకుముందెన్నడూ లేనివిధంగా దూసుకెళ్తోంది’ ఇది పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ చేసుకుంటున్న ప్రచారం. ఇదంతా అబద్ధమని తేలిపోయింది. మున్సిపాలిటీలు, ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీస్ -2020 ర్యాంకింగ్‌ ను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. వీటిలో పౌరసేవల్లో అత్యంత పేలవమైన పదర్శనతో చివరి నుంచి ఏడో స్థానంలో జీహెచ్ఎంసీ నిలిచింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో 34వ స్థానంతో హైదరాబాద్ సరిపెట్టుకుంది. మున్సిపల్​పనితీరులో 17వ ర్యాంకు, నివాసయోగ నగరాల్లో 24వ స్థానం, పౌరసేవల్లో 45వ స్థానంలో నిలిచింది.

దేశంలోనే మొదటిసారిగా మున్సిపల్​ ఫర్ఫామెన్స్ ఇండెక్స్ -2020 (ఎంపీఐ)ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నగరాల్లోని ప్రజలకు వారి స్థానిక సంస్థలు అందిస్తున్న సేవలపై ఏ మేరకు అవగాహన ఉందో పరీక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీలకు ర్యాంకింగ్‌ కోసం 20 కేటగిరీల్లో ఫర్ఫామెన్స్​అంచనా వేశారు. ఇందులో విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు, శానిటేషన్, వాటర్ మేనేజ్‌మెంట్, రెవెన్యూ, ఖర్చులు, డిజిటల్ అక్షరాస్యత, ప్లానింగ్, మానవ వనరులు, మున్సిపాలిటీల భాగస్వామ్యం- ప్రభావం అంశాలను చేర్చారు.

ఉత్తమ మున్సిపాలిటీల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుసగా ఇండోర్, సూరత్, భోపాల్ నిలువగా, జీహెచ్ఎంసీ 17వ స్థానంలో నిలిచింది. పది లక్షల కంటే అధిక జనాభా కలిగిన మున్సిపాలిటీల ర్యాంకింగ్‌‌లో పౌర సేవల్లో 45 వ స్థానంలో నిలిచింది. 51 నగరాలను మంత్రిత్వ శాఖ ఇందులో చేర్చగా బల్దియా చివరి నుంచి ఏడో స్థానంలో నిలిచింది. నగరంలో తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థలను అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రభుత్వం, ఎంఏయూడీ చెబుతున్న మాటలను కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొట్టిపడేసింది. ఈ విభాగంలో బల్దియాకు 33 వ స్థానం దక్కింది. పారదర్శకత, జవాబుదారీతనంలో 13వ స్థానంలో, ప్రజారోగ్యంలో 40వ స్థానం, విద్యలో 39వ స్థానంలో రెడ్ జోన్‌లో నిలిచింది. ప్రణాళికలను అమలు చేయడంలో ఇంకా ఘోరంగా 47వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వయంగా ఐటీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ డిజిటల్ అక్షరాస్యతలో 11వ స్థానంలో నిలిచింది. డిజిటల్ గవర్నెన్స్‌లో 20వ స్థానంలో నిలిచి పరువు నిలుపుకుంది.

రక్షణ, భద్రతల్లో 25వ స్థానం..

మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్ నగరం భద్రత, రక్షణ అంశంలోనూ 25వ స్థానంలో నిలిచింది. నివాసయోగ నగరాల ఇండెక్స్ -2020 జాబితాలో 2020 జనవరి 16 నుంచి మార్చి 20 వరకూ జరిగిన ఈ సర్వేలో 32.2 లక్షల మంది 111 నగరాల నుంచి పాల్గొన్నారు. పది లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 49 నగరాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ విభాగంలో హైదరాబాద్ 34వ స్థానంలో నిలిచింది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగంలో 25వ స్థానానికే పరిమితమైంది. ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలపై ప్రజలకున్న అవగాహనలోనూ హైదరాబాద్ 41 స్థానంలో నిలిచింది.

నియోసయోగ నగరాల జాబితా కోసం 20 సెక్టార్లలో వంద పారామీటర్స్‌పై సిటీజన్స్ నుంచి సమాధానాలు తెలుసుకుని ఈ జాబితా ప్రకటించారు. నివాసయోగ ప్రాంతాల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో బెంగళూర్, పూణే, అహ్మదాబాద్ నిలిచాయి. 2018 ప్రకటించిన నియోసయోగ నగరాల్లో మన రాష్ట్రం నుంచి హైదరాబాద్, కరీనంగర్, వరంగల్‌లకు స్థానం లభించగా ఈ సారి హైదరాబాద్ ఒక్క నగరానికే స్థానం దక్కింది.

Advertisement

Next Story

Most Viewed