నేరాల నియంత్ర‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం :సీపీ

by Shyam |
నేరాల నియంత్ర‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం :సీపీ
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: నేరాలు త‌గ్గించ‌డంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీల‌క‌మైంద‌ని హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ స్పష్టం చేశారు. బుధ‌వారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో శ్రీ వెంక‌టేశ్వ‌ర బిల్డింగ్ సొసైటీ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ద్వారా 50 శాతానికి పైగా నేరాల‌ను అదుపు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల‌తో స‌మాన‌మ‌న్నారు. ప్ర‌తి కాల‌నీలోనూ సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకునేందుకు కాల‌నీవాసులు కృషి చేయాల‌ని కోరారు. బృహ‌స్ప‌తి టెక్నాల‌జీ సంస్థ‌ ఏర్పాటు చేసిన‌ సీసీ కెమెరాలు ఎంతో అధునాత‌న‌మైన‌వ‌ని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

అనంత‌రం కాల‌నీ సొసైటీ అధ్య‌క్షుడు సిద్ధ‌య్య మాట్లాడుతూ.. రూ. 55 ల‌క్ష‌ల వ్య‌యంతో ఎమ్మెల్యే కాల‌నీని సుర‌క్షితంగా మార్చుకున్నామ‌ని తెలిపారు. రోడ్‌ నంబ‌ర్ 7,8 ల‌లో మొత్తం 125 నిఘానేత్రాల‌ను ఏర్పాటు చేయించామ‌న్నారు. ఇక ఎలాంటి నేరాలు, ఉల్లంఘ‌న‌లు జ‌రిగినా వెంట‌నే సొసైటీ కార్యాల‌యంతో పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో వెంట‌నే తెలిసిపోతుంద‌ని తెలిపారు. బృహ‌స్ప‌తి టెక్నాల‌జీ వారు త‌క్కువ స‌మ‌యంలో అప్ప‌గించిన ప్రాజెక్టును విజ‌య‌వంతంగా పూర్తి చేసి అప్ప‌గించార‌ని తెలిపారు.

బృహ‌స్ప‌తి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ పాపోలు మాట్లాడుతూ.. అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రాజెక్టును పూర్తి చేసి కాల‌నీ సొసైటీ క‌మిటీకి అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. కాల‌నీలో సాధార‌ణ ఫిక్స్ డ్ కెమెరాల‌తో పాటు 6 అధునాత‌న‌మైన ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిగ్గా నంబ‌రు ప్లేటును గుర్తించే కెమెరా) లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. సీసీ కెమెరాల‌ను కాల‌నీ సొసైటీ ఆఫీస్‌లోని కంట్రోల్ రూంతో పాటు బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కు కూడా అనుసంధానం చేశామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సొసైటీ ఉపాధ్య‌క్షుడు ఎన్‌.కె. బెంజిమిన్‌, కార్య‌ద‌ర్శి కె. వీరారెడ్డి, కోశాధికారి జి. రంగారెడ్డి, స‌భ్యులు జి. మోహ‌న్‌రెడ్డి, ఎ. చంద్ర‌శేఖ‌ర్‌, కె. ప్ర‌తాప్‌రెడ్డి, ఎం. న‌ర్సింగ్‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story