బీజేపీ కార్యకర్తను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

by Sumithra |
బీజేపీ కార్యకర్తను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
X

దిశ, చార్మినార్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పై దాడి ఘటనలో గాయపడిన దళిత కార్యకర్త నందురాజ్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం పాతబస్తీలో బహదూర్ పురా తాడ్బన్ లోని నందు నివాసానికి వెళ్లారు. అక్కడ బండి సంజయ్ నందు ఆరోగ్య పరిస్థితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తలకు గాయం కావడంతో చికిత్స తీసుకున్నట్లు నందు వివరించారు. ఈ సందర్భంగా దాడి ఘటన పూర్వాపరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. నందురాజ్ త్వరగా కోలువాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బీజేపీ కార్యకర్తల పై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. జరిగిన ఘటనను చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కన్పిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాల పై బీజేపీ ఎప్పటికప్పుడు నిలదీస్తుంటే ఓర్వలేక ఈ దాడులు చేయించినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కాని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఇటువంటి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ‘‘ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని కాంగ్రెస్ మూకల దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మా కార్యకర్తల సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని, మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులుండవ్ అని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరని గుర్తుంచుకుంటే మంచిదని, కాంగ్రెస్ నేతల దాడులకు, బెదిరింపులకు బీజేపీ లొంగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed