LIC: నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేసిన ఎల్ఐసీ

by S Gopi |
LIC: నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేసిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) తన స్టాల్‌ను బుధవారం ప్రారంభించింది. ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఈ ఎగ్జిబిషన్‌ ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఇక్కడ దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులు కొనుగోలు కోసం దాదాపు 2,000 స్టాల్స్‌ ఉంటాయి. వీటిలో భాగంగానే ఎల్ఐసీ తన స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీన్ని ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ప్రారంభించారు. ఈ స్టాల్ ద్వారా కస్టమర్లు ఎల్ఐసీకి సంబంధించిన సేవలు, ఇతర అంశాల గురించి తెలుసుకోవచ్చన్నారు. బీమా కాన్సెప్ట్‌ను వివరిస్తూ.. సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను ఎల్ఐసీ ఎలా తీర్తుస్తున్నది చెప్పారు. ఇదే సమయంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా మారిన తర్వాత కెరీర్ అవకాశాలు, ఇటీవల బీమా సంస్థ ప్రారంభించిన 'బీమా సఖీ' కార్యక్రమం గురించి ప్రస్తావించారు. బీమా సఖి అనే కార్యక్రమాన్ని సంస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎల్ఐసీ దీన్ని తీసుకొచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఎల్ఐసీ ఈ-సేవలు, ఆన్‌లైన్ సేవలు, పాలసీదారులకు లభిస్తున్న ప్రయోజనాల గురించి ఎల్ఐసీ స్టాల్‌లో అవగాహన పొందవచ్చని పునీత్ కుమార్ పేర్కొన్నారు. నుమాయిష్‌గా పేరుతో జరిగే ఈ ఎగ్జిబిషన్ జనవరి 3న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు తమ వస్తువులను విక్రయించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసుకుంటారు. సుమారు 2వేల స్టాళ్లలో వివిధ రకాల వస్తువులు, దుస్తులు, తినుబండారాలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed