హైదరాబాద్ గడ్డ.. సైబర్ నేరగాళ్ల అడ్డా

by Shyam |
హైదరాబాద్ గడ్డ.. సైబర్ నేరగాళ్ల అడ్డా
X

హైదరాబాద్ నగరం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈజీగా దోచేస్తున్నారు. వీరి వలలో చిక్కుకుని మోసపోతున్న వాళ్లంతా ఉన్నత చదువులు చదివిన వారే ఉండడం గమనార్హం. ఈజీగా మనీ సంపాదించేందుకు ఒకరు ఈ మార్గాన్ని ఎంచుకుంటే.. అదనపు డబ్బు రాబట్టుకోవాలనే దురాశతో కొందరు బాధితులుగా మారుతున్నారు. భాగ్య నగరంలో ఈ తరహా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

దిశ, క్రైమ్ బ్యూరో: నగరానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. అది కాస్తా.. ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. అదే చనువుతో నగ్నంగా చాటింగ్ చేసుకున్నారు. ఇంకేం.. ఆ నగ్న చిత్రాలను యువకుడి బంధువులకు, స్నేహితులకు పంపించింది ఆ యువతి. లక్షల రూపాయలు డబ్బు కావాలని డిమాండ్ చేసింది. పరువు పోతుందని భావించిన ఆ యువకుడు వారంలో రూ.3.63 లక్షలను తన ఖాతాకు బదిలీ చేశాడు. మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. విచారించిన సీసీఎస్ పోలీసులు మోసం చేసింది యువతి కాదనీ, తన చెల్లి పేరుతో ఓ యుువకుడే ఇన్‌స్టాగ్రామ్‌లో అ కౌంట్ తెరిచి మోసానికి పాల్పడినట్లు తెలిసింది.

మరో కేసులో బ్యాంకు అధికారిని అంటూ నమ్మించి మీ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ ఓ అపరిచిత వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఫోన్ చేశాడు. ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు. అతను చెప్పినట్లే చేశాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మీ ఖాతా నుంచి ఎవరికైనా ఐదు రూపాయలు పంపాలన్నాడు. అతడు పంపిన తర్వాత ఆ అపరిచితుడు లక్షలు కొల్లగొట్టాడు. మరో కేసులో తన ఫోన్‌కు వచ్చిన మెస్సేజ్‌కి రిప్లయ్ ఇవ్వడంతో.. ఓ మాజీ బ్యాంక్ మేనేజర్ రూ.1.75 లక్షల డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరో కేసులో ఒక వివాహిత.. తన భర్త, కుమారుడితో కలిసి పెళ్లి పేరుతో ముగ్గురి నుంచి రూ.5 కోట్లను కాజేసింది. ఇలాంటివి ఇంకెన్నో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సైబర్ మోసాలు.

సైబర్ నేరాలు రెట్టింపు

నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగేండ్లుగా చాలా మంది మోసపోయామని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 2017లో మొత్తం కేసులు 952, 2018లో 921, 2019లో 2,250, 2020లో 5 నెలల్లోనే 1649 కేసులు నమోదయ్యాయి. గతేడాది 2019లో మొత్తం కేసులు 2,250 నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 1393 కేసులు బుక్ అయ్యాయి. ఈ ఏడాది 5 నెలల్లో ఇప్పటికే 950 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కీలకమవుతున్న సోషల్ ఇంజినీరింగ్ ..

అపరిచిత వ్యక్తులు మనకి అందుబాటులో ఉన్నటెక్నాలజీ ద్వారా పరిచయాలు పెంచుకొని, మోసం చేసే పద్ధతినే సోషల్ ఇంజినీరింగ్ అంటారు. మనల్ని సంప్రదించేందుకు మాత్రమే టెక్నాలజీ అవసరమవుతోంది.. ఆ తర్వాత సాఫ్ట్‌గా మనల్ని మాటలతో నమ్మిస్తుంటారు. మొబైల్ కాల్స్, మెసేజ్, మెయిల్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికగా అపరిచిత వ్యక్తులు సంప్రదిస్తుంటారు. టార్గెటెడ్ వ్యక్తుల సమాచారం ఇంటర్నెట్ ప్లాట్‌ఫారాల ద్వారా ముందుగానే సేకరిస్తారు. ఆ తర్వాతనే రంగంలోకి దిగుతారు. మీ బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, కంప్యూటర్ యాక్సిస్ తదితర అత్యంత రహస్య సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఈ సంభాషణలు జరుగుతున్న సమయంలో సదరు వ్యక్తులు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతుంటాయి. అయినా సరే.. అంతటితో ఆగకుండా మీరు అదే విధంగా కొనసాగుతుంటారు. ఒకసారి స్పందించడం మొదలైతే మోసపోయే దాకా తేరుకోలేకపోవడమే సోషల్ ఇంజినీరింగ్ ప్రత్యేకత.

ఆ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఏ బ్యాంకు వాళ్లైనా ఖాతాదారులకు ఫోన్ చేయరు. డబ్బు వస్తుందంటూ నమ్మబలికే మాటలను నమ్మొద్దు. ముఖ్యంగా ఎనీ డెస్క్, టీమ్ వీవర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. వీటి ద్వారా మన చేతిలోని ఫోన్‌ను, ఎక్కడో ఉన్న అపరిచితులు రిమోట్ కంట్రోల్‌లాగా ఆపరేట్ చేస్తారు. ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నాక.. మిమ్ములను రూ.5 లు కానీ, రూ.10 లు కానీ ఎవరికైనా పంపాలని చెబుతుంటారు. ఈ సమయంలో ఆ యాప్‌ల ద్వారా మన వివరాలన్నీ గ్రహించి, క్షణాల్లో మన డబ్బును కాజేస్తారు. ఆ యాప్‌లతో చాలా ప్రమాదం. అందరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని కోరినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయండి. సాధ్యమైనంత వరకూ అపరిచితులు కాల్ చేస్తే మాట్లాడకపోవడమే మంచిది.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్

మూడు కమిషనరేట్ల పరిధిలో కేసులు

కమిషనరేట్ 2017-2018-2019-2020(మే)
హైదరాబాద్ 325 428 1,393 950
సైబరాబాద్ 255 293 477 499
రాచకొండ 372 200 380 200
మొత్తం 952 921 2,250 1,649

Advertisement

Next Story