- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్..? ఆ రోజే ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాలను వేడెక్కిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక మీదే దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఆసక్తి నెలకొంది. ఓ వైపు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీలో జోష్ పెరిగింది. ఈ సమయంలో రేవంత్‌రెడ్డికి హుజురాబాద్ బైపోల్ తొలి పరీక్షగా మారింది. అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తరువాత అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. ఇప్పుడు ఆ సమయం రావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఫోకస్ చేయనుంది. ఈ అంశంపై పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ స్పందించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని, కానీ నలుగురిని ఖరారు చేసి ఏఐసీసీకి పంపించామని రాజనర్సింహ వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేందుకు టీపీసీసీ కూడా నిర్ణయం తీసుకుంది. గురువారం భూపాలపల్లిలో జరిగే బహిరంగసభలో అభ్యర్థి పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఒక రిపోర్ట్ రెడీ
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థి ఎంపిక కోసం పీసీసీలో రెండు కమిటీలు నివేదికలు సిద్ధం చేశాయి. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ఒక కమిటీ కాగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కరీంనగర్, వరంగల్ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డితో మరో కమిటీ నియమించారు. ప్రస్తుతానికి దామోదర బృందం రిపోర్టును ఏఐసీసీకి పంపగా.. భట్టి కమిటీ నివేదిక మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. బుధవారం సీఎల్పీ భట్టి నివేదిక కూడా అందించనున్నారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చారు. ఈ నెల 30న భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటన చేయనున్నట్లు చెప్పుతున్నారు.
‘కొండా’ పోటీపై స్పష్టత
హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ, టీఆర్ఎస్‌లను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకురాలు కొండా సురేఖ ఉండాలని రేవంత్ రెడ్డి భావించారని.. ఇందుకోసం ఆయన ఆమెను ఒప్పించారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నదే. తాజాగా కొండా సురేఖను గాంధీభవన్‌కు పిలిపించుకుని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అండ్ టీమ్ మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే కొండా సురేఖ గతంలో పెట్టిన ప్రతిపాదనలపై పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇస్తామని, పరకాల, వరంగల్ తూర్పు వంటి డిమాండ్లు అనవసరమని, ఇప్పటికైనా పరకాల, వరంగల్ తూర్పు, హుజురాబాద్.. ఏది అంటే అదే ఫైనల్ చేస్తామంటూ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా హుజురాబాద్ నుంచి పోటీ చేస్తే.. గెలిచినా, ఓడినా వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని సూచించారు. దీనిపై బుధవారంలోగా అభిప్రాయం చెప్పాలని వెల్లడించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
సామాజికవర్గాల వారీగా..!
ఈ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ నలుగురి పేర్లతో ఏఐసీసీకి నివేదిక పంపించారు. దామోదర్ రాజనర్సింహ బృందం మొదట్నుంచీ ఇక్కడ అభిప్రాయాలను సేకరించింది. ఈ జాబితాలో కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, మాజీమంత్రి కొండా సురేఖ, ప్యాట రమేష్ పేర్లను ఏఐసీసీకి పంపించారు. సత్యనారాయణ ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు కాగా.. రెడ్డి వర్గం నుంచి కృష్ణారెడ్డి, బీసీ వర్గం నుంచి కొండా సురేఖ, ప్యాట రమేష్ రేసులో నిలిచారు. ఏ వర్గానికి ఈ ఉపఎన్నికల్లో అవకాశం ఇవ్వాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటే.. బరిలో ఉండబోయే అభ్యర్థి ఎవరనే విషయం తేలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ కూడా ఆ వర్గానికే టికెట్ ఇవ్వాలని భావిస్తే కొండా సురేఖ హుజూరాబాద్ బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్ దళితబంధు పథకానికి కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తే కవ్వంపల్ల సత్యనారాయణకు ఛాన్స్ దక్కుతుంది. రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ అనుకుంటే.. కృష్ణారెడ్డి పోటీలో ఉంటారని తెలుస్తోంది. అయితే వీరిలో కొండా సురేఖకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోవాలంటే బలమైన నేతను బరిలోకి దించాలని.. ఇందుకు కొండా సురేఖ అయితేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కాంగ్రెస్‌కు మరో భయం
కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ రూపంలో భయం పట్టుకుంది. ఇక్కడ అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడానికి అదే కారణమంటున్నారు. గతంలో పలు సెగ్మెంట్లలో అభ్యర్థులు టీఆర్ఎస్కు లోపాయికారికంగా అమ్ముడుపోయారనే ప్రచారం జరిగిందే. పరిణామాలు కూడా అదే విధంగా జరిగాయి. కొన్నిచోట్ల ముందుగా ప్రకటించిన అభ్యర్థులు ఆ తర్వాత అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కూడా కన్నేస్తుందని, అందుకే కొంత ఆలస్యంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుతున్నారు.