చైనా సరుకులకు గడ్డుకాలం

by Shamantha N |
చైనా సరుకులకు గడ్డుకాలం
X

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్ర ప్రభుత్వం సవరించిన కొన్ని రూల్స్ చైనా సరుకుల దిగుమతికి సవాలుగా పరిణమిస్తున్నాయి. దీంతోపాటు ఈ నె 15 నాటి గాల్వన్ ఘటనలో 20 మంది జవాన్లు వీరమరణం పొందాక వ్యాపారులు సహా పౌరులు కూడా చైనా ఉత్పత్తులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ చైనా అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ పరిస్థితులన్నీ చైనా సరుకులకు గడ్డుకాలాన్ని ఏర్పరిచాయి. కేంద్రం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం మన దేశంలో విక్రయించాలనుకునే సరుకుల మూల దేశం ఏదో వివరించాలి. కంట్రీ ఆఫ్ ఆరిజిన్‌ను ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్ ఈ-మార్కెట్‌ ప్లేస్‌లో పొందుపరచాలి. ఈ కండీషన్ ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులకు వర్తిస్తుంది. ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో ‘కంట్రీ ఆఫ్ ఆరిజిన్’ను ప్రవేశపెట్టక ముందు అప్‌లోడ్ చేసిన సరుకులకు సంబంధించిన ఈ సమాచారాన్ని సమర్పించాలని విక్రేతలకు సర్కారు ఆదేశాలు పంపింది. ఒకవేళ ఆ సరుకుల కంట్రీ ఆఫ్ ఆరిజిన్ సమాచారాన్ని అప్‌లోడ్ చేయకపోతే పోర్టల్ నుంచి తొలగించాల్సి ఉంటుందని హెచ్చరికలు పంపింది. అంతేకాదు, ఆ సరుకులో లోకల్ కంటెంట్ ఎంత అనే విషయాన్ని పొందుపరచాలని సూచించింది. ఈ సమాచారంతో దేశంలోని వ్యాపారులు ఏ సరుకులు కొనుగోలు చేసి విక్రయించాలో నిర్ణయించుకుంటారని తెలిపింది. అంటే సరుకులో దేశీయ ముడి సరుకు ఎక్కువ ఉన్నట్టయితే వాటినే క్రయవిక్రయాలు జరిపే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తున్నది. ఈ కొత్త నిబంధన సహా బార్డర్‌లో ఏర్పడ్డ ఉద్రిక్తతలు మనదేశానికి ఎగుమతి అవుతున్న చైనా సరుకులకు పెనుసవాల్‌గా మారాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సహా పౌర సమాజమూ చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు రోజులుగా దేశంలో ఎగుమతి దిగుమతులకు కీలకమైన 22 వైమానిక, నౌకా పోర్టుల్లో చైనా సరుకులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని చైనా సంస్థలు కూడా ధ్రువీకరించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed