సర్కారు దగ్గర పైసలున్నయో.. లేవో.. 'కాగ్' చెప్పేసింది

by Anukaran |
సర్కారు దగ్గర పైసలున్నయో.. లేవో.. కాగ్ చెప్పేసింది
X

దిశ, న్యూస్‌బ్యూరో : కొవిడ్ దెబ్బకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అయినా, బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా తొలి త్రైమాసికంలో రాబడులు గతేడాదిలాగే 18 శాతంగా నమోదయ్యాయి. ఇది కేంద్రం, ఆర్బీఐ ప్రత్యేక అనుమతితో ముందస్తుగా చేసిన ద్రవ్యలోటు అప్పులు, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధుల ద్వారా సాధ్యమైనట్లు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి రాబడుల్లో అప్పుల వాటా 26 శాతం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలిమూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందిన మొత్తం నిధుల్లో అప్పుల వాటా ఏకంగా 53 శాతానికి వెళ్లింది. దీంతో కొవిడ్ ప్రభావం కారణంగా వాస్తవ పన్ను ఆదాయం ఏ మేరకు తగ్గిందో స్పష్టమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కాగ్ వెల్లడించిన గణాంకాల్లో రాష్ట్ర మొత్తం రాబడుల్లో అప్పుల వాటా ఎంత ఉందనేది వెల్లడయింది. ఖర్చు విషయానికి వచ్చేసరికి మాత్రం తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా ఎక్కువగా మూడు శాతం రెవెన్యూ వ్యయం నమోదైందని కాగ్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో బడ్జెట్ అంచనాలలో 18 శాతం రెవెన్యూ వ్యయం నమోదవగా, ఈ ఆర్థిక సంవత్సరం అది 20.86 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో పెపెట్టుబడి వ్యయం గతేడాది తొలి మూడు నెలల్లో 21 శాతంతో పోలిస్తే 11.13 శాతానికి పడిపోవడం గమనార్హం.

కొవిడ్ ప్రభావం

ప్రత్యేక పరిస్థితుల్లో చేసిన అప్పుల కారణంగా ప్రభుత్వం చేతికి తొలి మూడు నెలల్లో భారీగానే నిధులు వచ్చినప్పటికీ, పన్ను ఆదాయం గతేడాదితో పోలిస్తే కొవిడ్‌ నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అమ్మకం పన్ను, ఎక్సైజ్ ఆదాయంలాంటి అన్ని రకాల పన్ను రాబడులు మొదటి మూడు నెలల్లో మొత్తం బడ్జెట్ అంచనాల్లో 15 శాతం కన్నా తక్కువగా వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఈ పన్ను ఆదాయాలన్నీ మొత్తం బడ్జెట్ అంచనాల్లో సగటున 20 శాతంగా నమోదయ్యాయి. అప్పులతో పాటు కేంద్ర పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేతికి మొత్తం బడ్జెట్ అంచనాల్లో వరుసగా 17,18.72 శాతం వచ్చాయి. ఇది గతేడాది తొలి మూడు నెలల్లో వచ్చిన 10.63,2.62 శాతాల కన్నా చాలా ఎక్కువ అని కాగ్ గణాంకాల్లో వెల్లడయింది. కొవిడ్ దెబ్బకు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయం కూడా ఎఫెక్టయినప్పటికీ రాష్ట్రానికి గతేడాది కన్నా తొలి మూడు నెలల్లో పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ భారీగా పెంచి ఇవ్వడం విశేషం. అప్పులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం తొలి త్రైమాసికం ఆదాయం గతేడాదితో సమానంగా బడ్జెట్ అంచనాల్లో వాటా కలిగి ఉందని తేలింది.

అప్పులతోనే

కొవిడ్ ప్రభావంతో బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాల్లో ద్రవ్యలోటు తొలి త్రైమాసికానికే 53.24 శాతానికి చేరుకుంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అప్పులను కేంద్రం, ఆర్బీఐ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇదే ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో తొలి త్రైమాసికం పూర్తయ్యే సరికి కేవలం 26.24 శాతంగా ఉందంటే కరోనా దెబ్బకు ఈ ఏడాది కేవలం తొలి మూడు నెలల్లోనే అప్పులు ఎంత మేర పెరిగాయనేది స్పష్టమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed