అద్దె గదులు ఖాళీ.. కాలనీల్లో వరుస TOLET బోర్డులు

by Shyam |   ( Updated:2021-06-13 11:35:43.0  )
tolet board
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహానగరంలో బ్యాచిలర్లు, ఉద్యోగులు, ఇతర పనులు చేసుకునే ప్రజలంతా పలు ప్రాంతాల్లో గదులు, ఇండ్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. గతేడాది మార్చి వరకు కళకళలాడిన అద్దె ఇండ్లు నేడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్‌డౌన్ కారణంగా అందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కోచింగ్ సెంటర్లు మూతపడటంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఇంటి ముఖం పట్టారు. పలువురు ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయి, మరికొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించడంతో చాలామంది తమ స్వగ్రామాల బాట పట్టారు. ఫస్ట్ వేవ్‌లో 60 శాతానికి పైగా అద్దె గదులు ఖాళీ అవ్వగా.. కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం కొందరు మాత్రమే తిరిగి నగరానికి వచ్చి తమ విధులు చేపడుతున్నారు. కొవిడ్ తగ్గడంతో కొంత పరిస్థితి మారింది. అప్పుడప్పుడే అంతా కోలుకుంటుండగా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడంతో తిరిగి గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు బ్యాచిలర్లు, ఉద్యోగులు.

ఎటు చూసినా టు-లెట్ బోర్డులే..

హైదరాబాద్ మహానగరంలో అమీర్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ఫిలింనగర్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చి‌బౌలి వంటి ఏరియాల్లో బ్యాచిలర్లు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. భవనాల యజమానులకు గదులను అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా ఒక ఆదాయ వనరుగా ఉండేది. ఆ డబ్బుతోనే వారి ఇల్లు, అవసరాలు గడిచేవి. గతేడాది ఫిబ్రవరి నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో అద్దె గదులన్నీ ఖాళీ చేశారు. దీంతో తమకు వచ్చే రెగ్యులర్ ఆదాయానికి బ్రేక్ పడింది. కాగా అద్దెకు ఎక్కువగా దిగే ప్రధాన ఏరియాల్లో టు-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో దాదాపు 60 శాతానికి పైగా నగరం ఖాళీ అయింది. ఆ సమయంలో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అద్దెల మీదనే ఆధారపడిన వారికి కష్టాలు తప్పలేదు. అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి పలువురు బ్యాచిలర్లు, ఉద్యోగులు నగరానికి చేరుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నా తిరిగి సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. తద్వారా పలు సంస్థలు ఉద్యోగులకు తిరిగి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది. ఇతర పనులు చేసుకునేవారికి ఎలాంటి పని దొరక్క తిరిగి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది.

బ్యాచిలర్లంతా ఖాళీ..

గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి బ్యాచిలర్లు ఉన్న రూములన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగాల వేటలో కోచింగ్ సెంటర్లకు వచ్చిన వారు, ఉన్నత చదువుల కోసం వచ్చిన వారు, ఇతర రంగాల్లో రాణించాలని వచ్చిన యువకులు, నిరుద్యోగులంతా మహానగరంలో ఆయా ప్రాంతాల్లో అద్దెకు దిగి తమ పనులు చేసుకునేవారు. ఎంతో ఆశతో నగరంలో అడుగుపెట్టిన వారికి కరోనా శాపంగా మారింది. తమ ఉపాధి అవకాశాలను దూరం చేసింది. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో కోచింగ్ సెంటర్లు, ఇన్‌స్టిట్యూట్స్ మూతపడ్డాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడంతో నిరుద్యోగులు కూడా తమ ఇండ్లకు తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది.

మహానగరంలో ఫ్యామిలీల కంటే బ్యాచిలర్లకు అద్దెకు ఇవ్వడం ద్వారానే ఎక్కువ లాభాలు వస్తాయన్న విషయం యజమానులకు బాగా తెలుసు. ఎందుకుంటే వారైతే ఒక్క గదిలోనే ఉంటారు. షేర్ చేసుకునే అవకాశముంటుంది కాబట్టి అద్దె కూడా ఎక్కువగా వసూలు చేసేవారు యజమానులు. వారంతా ఇంటివారి పట్టడంతో గదులన్నీ ఖాళీగా ఉన్నాయి. పరిస్థితులన్నీ సద్దుమణిగి ఇన్‌స్టిట్యూట్స్, ఉద్యోగ అవకాశాలు దొరికే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి.

ఉద్యోగులూ అదే దారిలో..

ఉన్న ఊరిని విడిచిపెట్టి ఏదో ఒక పని కోసం నగరానికి వెతుక్కుంటూ వచ్చి బతుకీడ్చే ఉద్యోగులపై కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. వాళ్ల జీవితాలు రోడ్డున పడగా.. వాళ్లను నమ్ముకుని గదులు అద్దెకిచ్చే వారికి కూడా కొవిడ్ వైరస్ షాకిచ్చింది. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో ఉద్యోగుల శాతం ఎక్కువగా ఉంటుంది. వేలకొద్దీ సాఫ్ట్ వేర్ సంస్థలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. కొవిడ్ ధాటికి చిన్న సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో ఉద్యోగుల బతుకులు రోడ్డుపాలైంది. వేరే సంస్థలో ఉద్యోగావకాశాలు కూడా లేకుండాపోవడంతో చేసేదేమీలేక వారుంటున్న ఇండ్లు ఖాళీ చేసి స్వగ్రామాలకు బయల్దేరారు. మరికొంత మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో తాముంటున్న గదులు ఖాళీ చేశారు. మరికొందరు ఉన్నా పలు సంస్థలు విపత్కర పరిస్థితుల కారణంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంతో అద్దె భరించలేక ఖాళీ చేసి ఇంటి బాటపట్టారు. కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థల ఉద్యోగులు నేటికీ వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నారు.

అద్దె విషయంలో వెనక్కి తగ్గని యజమానులు..

మహానగరంలో యజమానుల మొండి వైఖరి వల్ల కూడా అద్దె తీసుకునేందుకు జనం వెనుకాడుతున్నారని పలువురు వాపోతున్నారు. అద్దె విషయంలో వారు ఏమాత్రం తగ్గడంలేదని అంటున్నారు. తగ్గించడం పక్కన పెడితే విపరీతంగా పెంచేస్తున్నారని వారు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో 60 శాతం గదులు ఖాళీ అయిపోతే అప్పుడు ఇండ్ల అద్దెను తగ్గించారు యజమానులు. మొదటి వేవ్ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్కొక్కరు నగరానికి చేరుకుంటుండటంతో డిమాండ్ భారీగా ఉన్న ప్రాంతాల్లో ఇండ్ల అద్దె ధరను అమాంతంగా పెంచేసినట్లు ప్రజలు చెబుతున్నారు.

గతంలో తాము కోల్పోయిన అద్దెను తిరిగి ఇలా వసూలు చేసుకునే పనిలో కొందరు యజమానులు ఉన్నారని నిరుద్యోగులు, ఉద్యోగులు వాపోతున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిస్థితిని యజమానులు కూడా అర్థం చేసుకొని అద్దె తగ్గిస్తే బాగుంటుందంటున్నారు బ్యాచిలర్లు. బ్యాచిలర్లు అద్దెకు ఇచ్చేవారైతే చిన్న గదికే రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ఏడాదిగా గదులన్నీ ఖాళీగా ఉన్నాయి..

కరోనా వ్యాప్తి చెందడంతో మా ఇంట్లో అద్దెకు ఉండే బ్యాచిలర్లందరూ ఖాళీ చేశారు. నాలుగు గదుల్లో విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడా గదులన్నీ ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. వారి అద్దెల ద్వారానే ఇన్నాళ్లు మా కుటుంబం గడిచింది. గదులు ఖాళీ అయినప్పటి నుంచి ఎవరూ అద్దెకు రావడంలేదు. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఇన్‌స్టిట్యూట్స్ తెరిస్తే కానీ విద్యార్థులు తిరిగి రారు. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఈ పరిస్థితి మారేలా కనిపించడంలేదు.
— కృష్ణ, ఇంటి యజమాని, అమీర్ పేట

krishna

అద్దె తగ్గించాలి..

యజమానులు ఇంటి అద్దె భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో గదికి కనీసం రూ. 6 వేల వరకు తీసుకుంటున్నారు. గతంలో తాము కోల్పోయిన ఆదాయాన్నంతా ఇలా ధరలు పెంచి రాబట్టుకుంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా అద్దెలు పెంచడం సరికాదు. ఇలా ఇష్టం వచ్చినట్లు అద్దెలు పెంచడం వల్ల వచ్చే వారు కూడా వెనుకంజ వేస్తున్నారు. ఆదాయం తగ్గడం, ఉద్యోగావకాశాలు కోల్పోవడంతో అంత మొత్తంలో అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఓనర్లు తమ బాధలను అర్థం చేసుకుని అద్దె తగ్గిస్తే బాగుంటుంది.
— రాజు, ప్రైవేట్ ఉద్యోగి, యాదగిరి నగర్

Advertisement

Next Story