షేక్​పేట తహసీల్దార్ బదిలీ వెనుక భారీ స్కెచ్..?

by Shyam |
షేక్​పేట తహసీల్దార్ బదిలీ వెనుక భారీ స్కెచ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు రోజుల క్రితం షేక్​పేట మండల తహసీల్దార్​ను అకారణంగా బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ఎవరినైనా బదిలీ చేస్తే పోస్టింగు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఏ పోస్టింగ్ ఇవ్వకుండా సీసీఎల్ఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడమంటే చేయరాని తప్పేదో చేసినట్లుగానే పరిగణిస్తారు. అయితే ఈ తహసీల్దార్ ​శ్రీనివాస్​రెడ్డి చేసిన తప్పేమిటో ఉన్నతాధికారులు మాత్రం గోప్యంగా ఉంచారు.

రాజకీయ నాయకుల ఒత్తిడితోనే అతడిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పైగా ఓ ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా సదరు తహసీల్దార్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనూ నిజాయితీగా పని చేసిన అప్పటి తహసీల్దార్​తో గొడవ పడిన అనుభవాలు ఆ ఎమ్మెల్యేకు ఉన్నాయి. ఇప్పుడూ అదే తరహాలో తహసీల్దార్ తాను చెప్పిన పనులు చేయడం లేదని, తన అనూయుల పనులకు అడ్డు తగులుతున్నారన్న కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఫిలింనగర్​ నుంచి షేక్ పేట నాలా వైపు వెళ్లే దారిలోని ప్రభుత్వ భూములపై నెలకొన్న వివాదాలే కారణమని రెవెన్యూ వర్గాల నుంచి అందిన సమాచారం.

అందులోనూ సర్వే నం.403లోని ఓ 1500 గజాల స్థలంపై సదరు నాయకుల కన్ను పడింది. ఆ స్థలం ప్రభుత్వానికి అప్పటి జాయింట్​ కలెక్టర్ ​రవి కూడా తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అదే స్థలంలో ప్రభుత్వ స్థలమని బోర్డులు పాతారు. ఇప్పుడేమో రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో ఆ బోర్డులను కొందరు తొలగించారు. మళ్లీ బోర్డులు పాతించడంతోనే తహసీల్దార్​పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. అయితే, వివాదం చేయడం ఇష్టం లేని తహసీల్దార్ ​తన బదిలీ సహజమని మీడియాకు చెప్పడం గమనార్హం.

చర్యలెందుకు?

షేక్‎పేట తహసీల్దార్​ను మాత్రమే ఎందుకు బదిలీ చేశారు? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మిగతా తహసీల్దార్ల బదిలీ ఎందుకు జరుగలేదు? అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎందుకు చేసినట్లు? అంటూ రెవెన్యూ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా శ్రీనివాస్​రెడ్డి ఎలాంటి తప్పులు చేశారో ప్రకటించకుండానే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ విషయంలో అసలు విషయాలను ఉన్నతాధికారులు బయటికి చెప్పలేకపోతున్నారన్న విమర్శలొచ్చాయి. దీంతో తహసీల్దార్​ శ్రీనివాస్​రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిలీవ్​ కావాల్సిన అవసరం లేదంటూ జిల్లా స్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఆయన విధి నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా అదే కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆయనకు ఉద్యోగ సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది. అందుకే సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసినా అదే పోస్టులో కొనసాగుతున్నట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మండల స్థాయి అధికారిని ప్రభుత్వం బదిలీ చేయడం పట్ల ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ భూముల రక్షణ సందేహంగా మారుతుందంటున్నారు.

Advertisement

Next Story