తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి ఇలా…

by Anukaran |
తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి ఇలా…
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న సర్వేలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఆ సర్వేల ఫలితంగా గుర్తించిన అంశాలను చెత్తబుట్టలోకి వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే మొదలు.. నిన్నా మొన్న నిర్వహించిన వ్యవసాయేత భూముల గుర్తింపు సర్వే వరకు అంతా కాగితాలకే పరిమితమయ్యింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించి సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. ఆ సర్వే సారాంశాన్ని పక్కన పెడుతుండటం అధికార యంత్రాంగంలోనూ నిరుత్సాహాన్ని నింపుతోంది. దీంతో ప్రభుత్వ తీరుపై అధికారులు, సిబ్బంది లోలోపల తీవ్రంగా మదనపడుతున్నారు. అసలు ప్రభుత్వ సర్వేలు ప్రజలకు కోసమా.. పాలకుల కోసమా.. అనేది అంతుచిక్కడం లేదు. అయితే ఈ సర్వే ఫలితంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా 13వేలకు పైగా అక్రమ నిర్మాణాల బాగోతం బట్టబయలయ్యింది. అయినా నేటికీ వాటిపై చర్యలకు అతిగతీ లేకుండాపోయింది. ఇంతకీ అసలు ఆ సర్వే ఏంటి..? అధికార యంత్రాంగం ఎందుకు నిరుత్సాహాంగా ఉంది..?. అసలు అక్రమాలేంటి..? తదితర అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

ఇంటింటి సర్వే సారాంశమిదీ..

తెలంగాణ వ్యాప్తంగా గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో నిర్వహించిన వ్యవసాయేతర ఆస్తుల గుర్తింపు సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా ధరణి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అవినీతి రహిత రిజిస్ట్రేషన్ల విధానానికి రూపకల్పన చేస్తామని చెబుతోంది. అందులో భాగంగానే వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. ఆ సర్వేలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణలను లెక్క తేల్చింది. ఈ సర్వేలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఒక్క పురపాలికల్లోనే 13,761 అక్రమ కట్టడాల బాగోతం బహిర్గతమయ్యింది. అయితే ఈ సర్వే చేసి మూడ్నేళ్లు పూర్తయినా.. ఇంతవరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్న దాఖాలాల్లేవు.

అభివృద్ధికి ఆటంకంగా అక్రమ నిర్మాణాలు..

ఉమ్మడి నల్లగొండలోని మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి. వాస్తవానికి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తం జనరల్ ఫండ్‌లో నమోదవుతుంది. దీంతో ఆ నిధులతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, కార్యాలయం మెయింటనెన్స్, పలు అభివృద్ధి పనులకు కేటాయిస్తారు. కానీ మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలు ఉన్నప్పటికీ అధికారికంగా వాటిని గుర్తించకపోవడం.. పన్నులు వసూలు చేయకపోవడంతో మున్సిపాలిటీలకు జనరల్ ఫండ్ కొరత ఏర్పడింది. చాలా మున్సిపాలిటీల్లో జనరల్ ఫండ్ కొరత వల్ల అభివృద్ధి పనులను చేపట్టడం లేదు. పూర్తిగా ఆర్థిక సంఘం నిధులతోనే మమ అన్పించేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది.

17 మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాల లెక్క..

నల్లగొండలో

నందికొండ 4084
మిర్యాలగూడలో 3370
నల్లగొండలో ' 1440
దేవరకొండలో 594
హాలియాలో 381
చండూరులో 56
చిట్యాలలో 20

యాదాద్రి జిల్లాలో..

భువనగిరిలో 501
చౌటుప్పల్‌లో 409
మోత్కూరులో 349
ఆలేరులో 258
యాదగిరిగుట్టలో 204
పోచంపల్లిలో 32

సూర్యాపేట జిల్లాలో..

కోదాడ 1064
హుజూర్‌నగర్‌లో 340
తిరుమలగిరిలో 330
సూర్యాపేటలో 329

Advertisement

Next Story