ఫ్లాష్ ఫ్లాష్ : రూ.2500 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత..

by Anukaran |   ( Updated:2021-07-10 08:49:14.0  )
heroin
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధాని పరిధిలోని ఫరీదాబాద్‌లో ఢిల్లీ పోలీసులు భారీమొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2,500 కోట్ల విలువైన 350 కిలోల మాదక ద్రవ్యాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం కనిపెట్టలేదు. అలాగే, అతిపెద్ద అంతర్జాతీయ ముఠాను కూపీ లాగడమూ ఇదే తొలిసారి కానుంది. ఆఫ్ఘనిస్తాన్, ఐరోపా దేశాలు, భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా లింక్‌లున్నట్టు తెలుస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఆఫ్ఘన్ పౌరుడు హజ్రత్ అలీ, కశ్మీరీ రిజ్వాన్ అహ్మద్, పంజాబ్ నుంచి గుర్జోత్ సింగ్, గుర్దీప్ సింగ్‌లను అరెస్టు చేశారు.

డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంచులు, కార్టన్‌లలో కుక్కి ఇరాన్‌లోని చాబహర్ పోర్టు ద్వారా ముంబయికి చేరవేస్తున్నారని తేలింది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన శివపురిలోని ఓ ఫ్యాక్టరీకి ప్రాసెసింగ్ కోసం పంపుతున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఎక్స్‌పర్ట్స్‌లతో హెరాయిన్‌ తయారుచేస్తున్నారని, తర్వాత ఆ మాదకద్రవ్యాన్ని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్‌, జమ్ము కశ్మీర్‌ సహా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్నట్టు తేలింది. ఈ డ్రగ్ రాకెట్ వెనుకున్న మాస్టర్ మైండ్ నవ్‌ప్రీత్ సింగ్ పోర్చుగల్ నుంచి ఆపరేట్ చేస్తాడని ఓ నిందితుడు తెలిపాడు. ఈ రాకెట్‌కు పాకిస్తాన్ నుంచి ఫండ్ అందుతున్నట్టు తెలిసిందని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడతామని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం స్పెషల్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed