ఆర్​ఆర్​ఆర్​తో ఆదాయం ఎలా?

by Shyam |   ( Updated:2021-04-10 10:42:30.0  )
ఆర్​ఆర్​ఆర్​తో ఆదాయం ఎలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజనల్​ రింగ్​ రోడ్డుపై భారీ ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే రియల్​ ఎస్టేట్​ సంస్థలు అటు వైపు కన్నేశాయి. ప్రభుత్వం కూడా దీన్ని గ్రోత్​ కారిడార్​గా చెప్పుతోంది. మరోవైపు ఇదంతా రియల్​ సంస్థలకు ఆదాయం వచ్చేందుకే ప్రభుత్వం ఇలా ప్రకటిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక వైపు ఉంటే… ఈ ట్రిపుల్​ ఆర్​తో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎలా సమకూర్చాలనే ప్లాన్​ మొదలైంది. దీనిపై సీఎం కేసీఆర్​ దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల్లో టాక్​.

సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఆమన్‌గల్‌, యాచారం, కందుకూరు, షాద్‌నగర్‌, చేవెళ్ల, కంది పట్టణాలను అనుసంధానం చేస్తూ 338 కిలోమీటర్ల పరిధిలో రీజనల్​ రింగ్​రోడ్డును నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్​ వరకు మొదటి దశ 152 కి.మీ., రెండో దశ ఆమన్​గల్​ నుంచి కంది వరకు 186 కి.మీ. మేరకు ఉండగా, ఈశాన్య భాగం తూప్రాన్‌ నుంచి మల్కాపూర్‌ వరకు, ఆగ్నేయ భాగం మల్కాపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు, నైరుతి భాగం షాద్‌నగర్‌ నుంచి కౌలంపేట వరకు, వాయువ్య భాగం కౌలంపేట నుంచి తూప్రాన్‌ వరకు నిర్మాణం చేసేందుకు ప్రాథమిక డీపీఆర్​ను ఇచ్చారు. దీనిలో ఎన్‌హెచ్‌ 65, ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ 163, ఎన్‌హెచ్‌ 765లతో రింగ్​ ఏర్పడుతోంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ. 17 వేల కోట్లు (ఉత్తర భాగానికి రూ. 10 వేల కోట్లకుపైగా, దక్షిణ భాగానికి రూ. 6,481 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా.

రూ. నాలుగైదు వేల కోట్లు ఎలా రావాలి?

రీజనల్​ రింగ్​ రోడ్డుతో భూముల ధరలు పెరిగి, అక్కడి భూములున్న వారికి, రియల్​ సంస్థలకు భారీగానే కలిసి వస్తోంది. కానీ ప్రభుత్వ ఖజానాకు లాభం ఎలా అనేదే ఇప్పుడు మిలియన్​ డాలర్ల ప్రశ్న. దీనికోసం సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రీజనల్​ రింగ్​రోడ్డు నిర్మాణం చేసే పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలన్నీ తీసుకుంటున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వానికి కచ్చితంగా రూ. 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఆదాయం తీసుకువచ్చే నివేదికను సిద్ధం చేయాలని సూచించారని టాక్​. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా చర్చలు సాగిస్తున్నారంటున్నారు. మొత్తం దీని కోసం 11 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా… భూసేకణ వాటా రూ.3 వేల కోట్లుగా నిర్ధారించారు. భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం వాటా రూ.1,500 కోట్లు ఉంటోంది.

కానీ దీని నుంచి ప్రభుత్వానికి ఎలా ఆదాయం తీసుకురావాలనే సమగ్ర ప్లాన్​ తయారవుతున్నట్లు సమాచారం. ఈ భూ సేకరణ తర్వాత ప్రభుత్వం భూముల మార్కెట్​ ధరలను పెంచే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. వాస్తవంగా భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 1500 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇది రిజిస్ట్రేషన్లు, స్టాంప్​ వాల్యూతో రాబట్టుకోవచ్చని అంటున్నారు. అనంతరం ఈ ప్రాంతాల్లోని సర్కారు భూములను అమ్మాలని ప్లాన్​ ఉన్నట్లు చెప్పుతున్నారు. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రిజిస్ట్రేషన్ల నుంచి తీసుకుంటే… ఇక ఆర్​ఆర్​ఆర్​తో భూముల ధరలు పెరిగి, ప్రభుత్వ ఆధీనంలోని భూములు, దేవాదాయ శాఖ భూములను అమ్మితే ఆదాయం వస్తుందని వ్యూహంతో ఉన్నట్లు అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని భూములను ప్రభుత్వమే మాస్టర్​ లే అవుట్​గా చేసి విక్రయించే ప్లాన్​ కూడా ఉందంటున్నారు. కొంత మేరకు భూమిని లే అవుట్​ చేసి, ఎక్కువ భూమిని విక్రయించే అవకాశాలున్నాయంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేందుకు భూముల అమ్మకాలపై ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం… ఈ రీజనల్​ రింగ్​ రోడ్డుతో మరింత కలిసి వచ్చే ఛాన్స్​ ఉందని భావిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed